అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట అభించింది. అమిత్‌షా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీరాం ప్రజాపతి కేసును మరో కేసుగా పరిగణించనవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. సోహ్రాబుద్దీన్‌ కేసుతో పాటే ఈ కేసునూ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆయన గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సోహ్రాబుద్దీన్‌, తులసీరాం పండిట్‌ ఎన్‌కౌంటర్లు వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. రెండు ఎన్‌కౌంటర్లూ నకిలీవని ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై జరిగిన విచారణలో అమిత్‌షా దోషిగా తేలడంతో 2010లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. మూడు నెలలు జైలుశిక్ష అనుభవించి సోహ్రాబుద్దీన్‌ కేసులో బెయిల్‌పై విడుదలయ్యాయి. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని అమిత్‌షాను గుజరాత్‌ విడిచివెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతేడాది సెప్టెంబరులో తిరిగి వచ్చేందుకు అనుమతించింది. తులసీరాం కేసును విడిగా చూడాలని కోరుతూ సీబీఐ మరోసారి అమిత్‌షాను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రెండు ఎన్‌కౌంటర్‌ కేసులనూ ఒకటిగానే భావించాలని సూచించింది.