అమెరికన్‌ కోర్టులో టిసిఎస్‌పై దావా

ఉద్యోగుల తొలగింపుపై అమెరికన్ల కేసు

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమెటెడ్‌పై అమెరికాలో విచారణ ఎదుర్కోబోతోంది. అమెరికాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అమెరికన్‌ ఉద్యోగులను కంపెనీ ఎందుకు తొలగించిందని ప్రశ్నిస్తూ అక్కడ దావా దాఖలైంది. జాతి వివక్షతో తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన ఈ దావాపై కాలిఫోర్నియా కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. టీసీఎస్‌ తమను ఏ క్లైంట్స్‌కు అసైన్‌ చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని, తమపై వివక్ష చూపారని అమెరికన్‌ ఉద్యోగులు దావాలో పేర్కొన్నారు. 2011 నుంచి టీసీఎస్‌ అమెరికాలో దక్షిణాసియాయేతర ఉద్యోగులను 12.6శాతం మందిని తొలగించగా, కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది దక్షిణాసియా దేశాలకు చెందిన ఉద్యోగులను తొలగించారని అమెరికన్‌ ఉద్యోగులు ఫిర్యాదులో తెలిపారు. ఈ దావాపై టీసీఎస్‌ స్పందించింది. తమ కంపెనీ ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని పేర్కొంది. పనితీరు ప్రామాణికంగానే ఉద్యోగాల నుంచి తొలగించామని, విచారణలో విజయం సాధిస్తామని టీసీఎస్‌ అధికార ప్రతినిధి విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాతో పాటు అంతర్జాతీయంగా తమ క్లైంట్లకు ప్రతిభావంతులైన ఉద్యోగులను అందిస్తామని, వారి వ్యక్తిగత నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా క్లైంట్ల అవసరాలకు సరిపోయే ఉద్యోగులను కేటాయిస్తామని తెలిపారు. టీసీఎస్‌ అన్ని చోట్లా సమాన ఉద్యోగ అవకాశాల చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటిస్తుందని స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా విధానాలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సహా తదితర కంపెనీలు ఎక్కువ మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్‌ యంత్రాంగం ఒత్తిడి చేస్తూనే ఉంది. టీసీఎస్‌పై జరిగే విచారణ ప్రభావం హెచ్‌-1బీ వీసాల ఆధారంగా ఉద్యోగాలిస్తున్న ఐటీ కంపెనీలపై పడే అవకాశం ఉంది.