అమెరికాకు ఎంతో రుణపడి ఉన్నాం : అష్రఫ్‌ఘని
వాషింగ్టన్, మార్చి 26 : ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహించిన అమెరికాకు తామెంతో రుణపడి ఉన్నట్లు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తెలిపారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అగ్రరాజ్యం అందించిన సహాయాన్ని కీర్తించారు.
ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాకు ఎంతో రుణపడి ఉన్నట్లు ఆయన తెలిపారు. అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ఆయన అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించారు. కేపిటల్ హిల్‌లో రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు అష్రఫ్ ఘనికి ఘన స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌లో విధులు నిర్వహిస్తూ సుమారు 2,200 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఘని ఆ అంశాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి నిధులు, సౌర సహాయం అందించిన అగ్ర దేశానికి ఘని ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని విదేశీ పర్యటనలో ఉండగా కాబూల్‌లో కారు బాంబ్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ అధ్యక్షుడి అధికారిక నివాసానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.