అమెరికాకు మరో దెబ్బ
– అమెరికా వస్తువులపై సుంకాలు పెంచిన కెనడా
ఒట్టావా, జూన్30(జనం సాక్షి) : అగ్రరాజ్యం అమెరికాను కెనడా దెబ్బకు దెబ్బ కొట్టింది. కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఫ్లోరిడా నారింజ పండ్ల రసం, కెచప్, కెంటుకీ బోర్బోన్ విస్కీలపై సుంకాలు పెంచుతున్నట్లు తెలిపింది. కెనడా నుంచి దిగుమతయ్యే స్టీలు, ఉక్కులపై అమెరికా సుంకాలు పెంచిన నేపథ్యంలో కెనడా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికా విధించిన సుంకాలు ఆదివారం నుంచి అమలుకానున్నాయి.అమెరికా సుంకాలు పెంచినందువల్ల.. తమకు మరో అవకాశం లేక దిగుమతి సుంకాలు పెంచాల్సి వస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయం కోపంతో తీసుకోలేదని, బాధతో తీసుకున్నామని కెనడా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. దాదాపు 250 అమెరికా ఉత్పత్తులపై కెనడా సుంకాలు విధించింది. ఫ్లోరిడా జ్యూస్, విస్కాన్‌సిన్ టాయిలెట్ పేపర్, మెటల్స్ తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులపై ఒత్తిడి పెంచేందుకు కెనడా ఈ విధమైన చర్యలు చేపట్టింది.