అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం
శ్వేతసౌధం ప్రకటన.. అయినా పంతం వీడని ట్రంప్
వాషింగ్టన్,నవంబరు 22(జనంసాక్షి):ఎన్నికల్లో ఓడిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అధికార బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడితే అందుకు చట్ట ప్రకారం చేయాల్సిన అన్ని పనులను చేస్తున్నామని శ్వేత సౌధంలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ట్రంప్ అధికార యంత్రాంగం ప్రకటించింది. శుక్రవారం శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ క్యాలీ మెక్ ఎనానీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వాదనను సమర్థించారు. బైడెన్ గెలిచినట్టు ఆమె ఇంకా గుర్తించలేదు. ”అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు. చట్టబద్ధమైన ప్రతి ఒక్క ఓటునూ లెక్కించాలని కోరుతున్నారు. ఆయన చెబుతున్నవన్నీ వాస్తవాలే” అని అన్నారు. ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్) ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను మొదలుపెట్టామని అన్నారు. అధికార యంత్రాంగం తరఫున చేయాల్సిన పనులను చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై అధికారిక ధ్రువీకరణ పత్రాలు ఇంకా అందకపోవడంతో అధికార మార్పిడిని పర్యవేక్షించాల్సిన జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కూడా మౌనం పాటిస్తోంది. బైడెన్ విజయం సాధించినట్టు ఆ విభాగం అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ ఇంతవరకు గుర్తించలేదు. తగిన సమయంలో ఈ గుర్తింపు వస్తుందని ఎనానీ చెప్పారు.విస్కాన్సిన్ రాష్ట్రంలోని డేన్, మిల్‌వాకీ కౌంటీల్లో ఓట్ల తిరిగి లెక్కింపు శుక్రవారం ప్రారంభమయింది. ఈ రెండూ డెమొక్రాట్లకు కంచుకోటల్లాంటివి. ఇక్కడ పోలయిన వేలాది పోస్టల్ బ్యాలెట్‌లను రద్దు చేయాలంటూ ట్రంప్ తరఫున రిపబ్లికన్ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై చిరునామాలు లేకపోతే వాటిని ఎన్నికల క్లర్కులే రాశారని, ఇక్కడే అక్రమాలకు మార్గం ఏర్పడిందని వారు ఆరోపించారు. అయితే ఇలా చిరునామాలు రాసే అధికారం ఇక్కడి చట్టం ప్రకారం క్లర్కులకు ఉందంటూ బోర్డ్ ఆఫ్ కాన్వార్సెర్స్ 2-1 మెజార్టీతో స్పష్టం చేసింది. గత 11 ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దాంతో పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకొని లెక్కింపు జరుపుతున్నారు. ఇంకోవైపు జార్జియాలో బైడెన్ గెలిచినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్, ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. కెంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.ట్రంప్ పట్టుదలల మాట ఎలా ఉన్నా బైడెన్ మాత్రం మంత్రివర్గం కూర్పుపై కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే వారమే దీన్ని ఖరారు చేయనున్నారు. మొత్తం 15 మందితో నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో నాయకులను ఎంపిక చేసుకోవడం ఆయనకు కష్టంగా మారింది. మరోవైపు తనను పెద్ద పెద్ద ఔషధ తయారీ కంపెనీలే ఓడించాయని ట్రంప్ ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు కోట్లాది డాలర్లు వెచ్చించాయని అన్నారు. శ్వేత సౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ”పెద్ద ఫార్మా కంపెనీలు మాకు వ్యతిరేకంగా పనిచేశాయి. విూడియా కూడా వ్యతిరేకించింది. టెక్నాలజీ కంపెనీలూ మాకు వ్యతిరేకమే” అని చెప్పారు. మందులు, పరీక్షల ధరలు తగ్గిస్తూ జులైలో ఉత్తర్వులు ఇచ్చానని, ఈ సంస్కరణలను తట్టుకోలేకే ఓడించాయని అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఔషధ కంపెనీలు ఖండించాయి. విదేశీ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాలనే తాము వ్యతిరేకించినట్టు తెలిపాయి.