అమెరికాలో ఆరని కార్చిచ్చు!

– వారం రోజులుగా ఎగిసిపడుతున్న మంటలు
కాలిఫోర్నియా, జులై7(జ‌నం సాక్షి) : అమెరికాలోని కాలిఫోర్నియా-ఒరెగాన్‌ సరిహద్దుల్లో ఉన్న అడవిలో గత శనివారం చెలరేగిన కార్చిచ్చు ఒకరిని బలి తీసుకుంది. మరో పన్నెండు భవంతులను బుగ్గిపాలు చేసింది. పొడి వాతావరణం, ఎండల తీవ్రతకు అంతకంతకు విస్తరిస్తున్న ఈ దావానలాన్ని అదుపు చేసేందుకు కాలిఫోర్నియా అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా సాధ్యపడటం లేదు. ఒరెగాన్‌ సరిహద్దులకు 22 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కాగ్నబుక్‌ అనే చిన్న పట్టణం దిశగా కార్చిచ్చు విస్తరిస్తోంది. వీలైనంత త్వరగా ఆ పట్టణాన్ని ఖాళీ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. అదుపు చేయలేని రీతిలో ఎగసి పడుతున్న మంటల వేడి తాలుకా ప్రభావం అరిజోనా, నెవాడా, ఊఠాలపైనా పడుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఉత్తర ఒరెగాన్‌ అధికారులు అడవుల వైపు వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటికే వేల మందిని ఉత్తర కాలిఫోర్నియా అధికారులు ఖాళీ చేయించారు. 360 చ.కి.విూల పరిధిలో విస్తరించిన మంటలను కొంతవరకు మాత్రమే అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయగలిగారు.