అమెరికాలో తెలుగు విద్యార్థి బ‌లి

కన్సాస్‌(జ‌నం సాక్షి): అమెరికాలో దుండగుల దుశ్చర్యకు మరో తెలుగు విద్యార్థి శరత్‌ బలైన విషయం తెలిసిందే. కన్సాస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో శరత్ మృతి చెందాడు. అయితే, ఈ హత్యకు సంబంధించి రెస్టారెంట్‌లో నమోదైన సీసీటీవీ దృశ్యాలను కన్సాస్‌ పోలీసులు విడుదల చేశారు. అయితే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది తెలిపిన వివరాల మేరకు శరత్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడికి దొంగతనం చేయడానికే వచ్చాడని, అది అడ్డుకోబోయిన శరత్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. తుపాకీ చూపిన వెంటనే దుండగుడి నుంచి తప్పించుకోబోతుండగా అతడు కాల్పులు జరపడంతో శరత్‌ వెనకపైపు బుల్లెట్లు తగిలాయని.. వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడని తెలిపారు.

దీనిపై రెస్టారెంట్‌ యజమాని షాహిద్ మాట్లాడుతూ… ‘రెస్టారెంట్‌లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడిని చూడగానే మా అందరికీ భయం వేసింది. అతడు వెంటనే గన్‌ బయటికి తీశాడు. దుండగుడు దోచుకోవడానికే వచ్చాడు. మా అందరివైపు గన్‌ చూపించాడు. అయితే అతడిని శరత్‌ అడ్డుకున్నాడు. మేం అందరం వారించే సరికి శరత్‌ దుండగుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ వ్యక్తి శరత్‌పై కాల్పులు జరిపాడు. శరత్‌ వెనకవైపు బలంగా తూటాలు తగిలాయి. దీంతో అక్కడే అతడు కుప్ప కూలిపోయాడు. మేం 911 నంబరుకు కాల్‌ చేసేలోపే దుండగుడు పారిపోయాడు’ అని తెలిపారు.

శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌ కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.