అమెరికాలో పత్రికా కార్యాలయంపై కాల్పులు
– ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
– అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేసిన అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్‌టన్, జూన్29(జనం సాక్షి ) : అమెరికాలో మరో దారుణం జరిగింది. మేరీలాండ్‌లోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. కొంత మంది గాయపడ్డారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆనె అరుండెల్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.అతడు సాక్ష్యాధారాలు లేకుండా తన వేలిముద్రలను చెరిపేసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఓ లాంగ్ గన్ సాయంతో ఈ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఓ బ్యాగులో గ్రెనేడ్లు, స్మోక్ బాంబులను తన వెంట తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇదే బిల్డింగ్‌లో ఉన్న పత్రిక కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్‌ల నుంచి 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినట్లు చెప్పారు. ఓ గ్లాస్ డోర్ అవతలి నుంచి ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన 45 నిమిషాల వ్యవధిలో అదే పత్రికకు చెందిన వెబ్‌సైట్‌లో ఈ వార్తను పోస్ట్ చేయగలిగారు. ఈ క్యాపిటల్ గెజిట్ పత్రికకు ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి ఎందుకు ఈ పని చేశాడన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన తర్వాత క్యాపిటల్ గెజిట్ బిల్డింగ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మేరీలాండ్ రాష్ట్ర రాజధానితోపాటు ఆనె అరుండెల్ కౌంటీలో క్యాపిటల్ గెజిట్ పత్రికను ఎక్కువగా చదువుతారు. దేశంలోని అత్యంత పురాతన పత్రికల్లో తమదీ ఒకటని, 1727లోనే మేరీలాండ్ గెజిట్ పేరుతో ఈ పత్రిక వెలువడేదని యాజమాన్యం చెబుతున్నది. ప్రస్తుతం ఈ పత్రికలో మొత్తం 31 మంది ఎడిటోరియల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు మేరీలాండ్ గవర్నర్ లారీ ¬గాన్ ట్విటర్‌లో స్పందించారు.
మేరీలాండ్‌లో ఈ ఘటన జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్‌లోని పత్రికా కార్యాలయాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రిక సర్క్యులేషన్ 29 వేలుగా ఉంది.
ఇదిలా ఉంటే కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.