అమెరికాలో పనిచేయని బూస్టర్ డోసు
` ఒమిక్రాన్‌తో గజగజ
వాషింగ్గన్,డిసెంబరు 11(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్`19 సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక మంది ఈ మహమ్మారి కాటుకు బలైపోయిన విషయం తెలిసిందే. అయినా, కొవిడ్ మహమ్మారి అమెరికాను ఇంకా వెంటాడుతూనే ఉంది. గతంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈ మధ్యకాలంలో మళ్లీ రోజుకు సగటున లక్షకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికితోడు దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని 22 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాపించినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడిరచింది. ఆ సంస్థ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. అమెరికాలో 43 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ సోకిన వారిలో 34మంది వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఉన్నారు. వీరిలో 14 మందికి బూస్టర్ డోసు కూడా పూర్తయినా ఒమిక్రాన్ బారిన పడటం గమనార్హం.అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా.. ఇప్పటివరకు ఎక్కడా ఈ కొత్త వేరియంట్ కారణంగా మరణాలు నమోదు కాలేదు. దీని బారినపడినవారిలో దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలే గుర్తించారు. దేశ, విదేశాలకు ప్రయాణాలు, పెద్ద ఎత్తున గుమిగూడటంతో ఈ వేరియంట్ ప్రబలినట్టు సీడీసీ గుర్తించింది. వ్యాక్సినేషన్, విధిగా మాస్క్ ధరించడం, వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, అనుమానం వస్తే పరీక్షలు చేసుకోవడం, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలే ఏ వేరియంట్ నుంచైనా కాపాడతాయని సీడీసీ సూచించింది. అమెరికాలో తొలిసారి డిసెంబర్ 1న ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది.కొవిడ్ 19 కేసులు అమెరికాను ఇంకా వణికిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో ఇన్ఫెక్షన్ ఉద్ధృతి పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వారంలో అమెరికాలో రోజుకు సగటున 1,20,000 కేసులు బయటపడగా.. గత వారంతో పోలిస్తే ఇది దాదాపు 40శాతం అధికం కావడం గమనార్హం. కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో గత వారంతో పోలిస్తే ఆస్పత్రుల్లో చేరేవారి శాతం 40శాతం మేర పెరిగింది. రోజుకు దాదాపు 7500 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అమెరికాలో శుక్రవారం వరకు 200 మిలియన్ల మందికి పైగా (60.6శాతం) పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేసుకోగా.. 51.7 మిలియన్ల మందికి బూస్టర్ డోసులు కూడా పూర్తయింది. అమెరికాలో ఇప్పటివరకు 4,98,33,432 కొవిడ్` 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దీని ప్రభావంతో 7,96,749మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కొవిడ్ కేసులు, మరణాలు అమెరికాలోనే అధికం.