అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు పైనే
హైదరాబాద్: అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ దీనికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. కోవిడ్19 వల్ల అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 112900 మంది చనిపోయారు. ఇక వైరస్ కేసుల సంఖ్య 2000464కు చేరినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొన్నది. తాజా లెక్కలతో కేసుల సంఖ్య విషయంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానాల్లో బ్రెజిల్, రష్యా దేశాలు ఉన్నాయి. అమెరికాలో సుమారు 21 రాష్ట్రాల్లో ఇంకా వైరస్ సంక్రమణ జోరుగానే కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న తీరు ఆ దేశ ప్రజల్లో కొంత ఆందోళన క్రియేట్ చేస్తున్నది.
అమెరికాలో వైరస్ సంక్రమణ రేటు.. బ్రెజిల్‌తో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం ప్రపంచదేశాలతో పోలిస్తే, అమెరికాలోనే అత్యధిక స్థాయిలో వైరస్ టెస్టింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఆ దేశంలో 5 లక్షల మేర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటును 20 వేల కేసులు నమోదు అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు లాటిన్ దేశం మెక్సికోలో పరిస్థితి దారుణంగా ఉన్నది. మెక్సికోలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 15357గా నమోదు అయ్యింది. గత 24 గంటల్లో ఆ దేశంలో 708 మంది చనిపోయారు.