అమెరికాలో ప్రారంభమైన ఓటింగ్..
హైదరాబాద్,నవంబరు3 (జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు. అయితే పోలైన అయిదు ఓట్లు బైడెన్ ఖాతాలో పడ్డాయి. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా పోలవ్వలేదు. డిక్స్‌విల్లీ గ్రామస్తులు ఏకపక్షంగా డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేశారు. కెనడా బోర్డర్‌కు సవిూపంలో ఉన్న అడవుల్లో డిక్స్‌విల్లీ గ్రామం ఉన్నది. 1960 నుంచి సాంప్రదాయబద్దంగా ఈ గ్రామం నుంచే అమెరికా ఎన్నికల రోజున ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. అయితే డిక్స్‌విల్లీకి సవిూపంలో ఉన్న మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అర్థరాత్రే ఓటింగ్‌లో పాల్గొంటుంది. మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 ఓట్లు పోలయ్యాయి. బైడెన్‌కు అయిదు ఓట్లు వేశారు. గత ఏడాది డిక్స్‌విల్లీ గ్రామం ఓటర్లు హిల్లరీ క్లింటన్‌కు ఓటేశారు. కానీ ఆ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. మరో గ్రామం హార్ట్స్ .. కరోనా వల్ల ఎన్నికలను బహిష్కరించింది. న్యూ హ్యాంప్‌షైర్‌లో ఉన్న మున్సిపాల్టీల్లో వంద కన్నా తక్కువ నివాసితులు ఉన్న గ్రామాల్లో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రిజిస్టర్డ్ ఓట్లు పోలైన వెంటనే బూత్‌లను మూసివేస్తారు. అమెరికాలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్లు అన్నీ ఉదయం 6 గంటలకు తెరుచుకుంటాయి. అమెరికాలో జరిగిన ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే పది కోట్ల ఓట్లు పోలయ్యాయి. రిపబ్లిక్ అభ్యర్థిగా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఓపీనియన్ పోల్స్‌లో బైడెన్ ముందంజలో ఉన్నా.. ట్రంప్ విక్టరీ ఖాయమన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
ముందస్తు ఓటేసిన భారతీయులు..
హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్ జోరుగా సాగింది. దాదాపు 9.8 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమెరికా ఎన్నికల చరిత్రలోనూ ఇదో రికార్డు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ రోజు కన్నా ముందే ఇంత భారీ సంఖ్యలో అమెరికన్లు ఓటు వేయడం ఇదే మొదటిసారి. అయితే భారత సంతతి ఓటర్లు కూడా ఈసారి అత్యధిక సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా.. చాలా వరకు ఓటర్లు ముందే ఓటేశారు. అబ్సెంట్ బ్యాలెట్‌గా పిలువబడే ముందస్తు ఓటింగ్ అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. ఇవాళ జరిగే పోలింగ్‌లో ట్రంప్, బైడెన్ భవితవ్యం తేలనున్నది.సాధారణంగా పూర్తి ఫలితాలు రావాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ పోలింగ్ జరిగిన మరుసటి రోజే దాదాపు విజేత ఎవరో ఖాయం అవుతుంది. 2016లో పోలింగ్ జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు డోనాల్డ్ ట్రంప్ విక్టరీ ప్రసంగం చేశారు. అయితే ఈసారి పూర్తి ఫలితాల ప్రకటన మాత్రం కొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరగడం వల్ల.. వాటి లెక్కింపు ఆలస్యం అవుతుందని అధికారులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.2000 సంవత్సరంలో విజేత ప్రకటించేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. వేరువేరు రాష్ట్రాలు వేరువేరు పద్దతుల్లో లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తాయి కాబ్టటి.. వాటి ఫలితాల ప్రకటన భిన్న సమయాల్లో జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల తుది ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పూర్తి లెక్కింపు జరిగేందుకు వారాల సమయం పడుతుంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మంగళవారం రాత్రి తన విక్టరీ సందేశాన్ని ఇవ్వనున్నట్లు కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి.