అమెరికాలో భారీ పేలుడు

అమెరికాలో భారీ పేలుడు
 వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని 100 కార్స్(ముడి చమురుతో ఉన్న బోగీలు)లో  30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కనావా, ఫెయెటీ కౌంటీల్లో అత్యవసరస్థితి ప్రకటించారు. సంఘటనా స్థలానికి ఒక కిలోమీటరకు దూరం వరకు ఉన్న నివాసితులు ఖాళీ చేయాలని పోలీసులు కోరారు.
రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఎన్ఎన్ తెలిపింది. రైలులోని ముడి చమురు కనావా నదిలో కలిసింది. కనావా, ఫెయెటీ కౌంటీ వాసులకు మంచినీరు అందించే ఈ నదిలో చమురు కలవడంతో తాగునీటి కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో మంచినీటిని నిల్వచేసుకోవాలని పశ్చిమ వర్జీనియా గవర్నర్ ఎర్ల్ రే తొంబ్లిన్ విజ్ఞప్తి చేశారు.