అమెరికాలో ముస్లింలకు బెదిరింపులు
‘ట్రంప్ వచ్చాడు. ఇక మీరు గడియలు లెక్కించుకునే రోజొచ్చింది. యూదుల విషయంలో హిట్లర్ ఎలా చేశాడో.. ముస్లింల విషయంలో ట్రంప్ కూడా అలాగే చేస్తాడు’ అని అమెరికాలోని ముస్లింలను బెదిరిస్తూ కొన్ని లేఖలు అక్కడి మసీదులకు వెళ్లాయి. అమెరికన్స్ ఫర్ ఏ బెటర్ వే పేరిట చేతి వ్రాతతో రాసిన ఈ లేఖలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాలిఫోర్నియాలోని శాన్ జోస్, లాంగ్ పనోమాలో గల మసీదులకు పంపించారు. ముస్లింలను దుష్టులు, సతాను వారసులు అని అందులో పేర్కొన్నారు. ట్రంప్ తమ కొత్త రక్షకుడని, ఆయన నిండు జీవితం బతకాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలివైన వాళ్లయితే ఇప్పుడే బ్యాగులు సర్దుకుని పారిపోవాలని కూడా హెచ్చరించారు. ట్రంప్ వచ్చిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.