అమెరికా అతలాకుతలం

విద్యుత్‌ పునరుద్ధణకు మరో రెండు రోజులు
అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఒబామా
న్యూయార్క్‌,అక్టోబర్‌31 (జనంసాక్షి):
అమెరికా తూర్పు తీరంలో శాండీ తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, అట్లాంటా… తదితర నగరాల్లో భారీ ఎత్తున సహాయకచర్యలను అధికారులు ప్రారంభించారు. మంగళవారం అల్పపీడనం తుపానుగా మారడంతో గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ తుపాను ప్రభావంతో తీరం దాటే సమయంలో గంటకుఅమెరికాతూర్పు తీరంలోని నగరాలన్నీ నీటమునిగాయి. ఉత్తర కరోలినా, దక్షిణ కరొలినా ,మాసాచుసెట్స్‌ … తదితర తూర్పు రాషాలెపై శాండీ తన ప్రభావాన్ని చూపింది. సోమవారం నుంచి వీస్తున్న ఈదురు గాలులకు రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే ఆగిపోయింది. పలువిమానాలు రద్దయ్యాయి. మంగళవారం నుంచి ఎనిమిది మిలియన్లమంది ప్రజలు విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో చీకట్లో గడుపుతున్నారు. ఈ తుపాను ప్రభావానికి దాదాపు 50మంది మరణించారు. ఆస్తినష్టానికైతే లెక్కేలేదు. మరణించిన వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. సముద్రపు నీరు వేగంగా కొట్టుకురావడంతో ఇళ్లు, చెట్లు, పార్కులు కూలిపోయాయి. న్యూయార్క్‌ నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. విమానాశ్రయాలు, వంతెనలు, రహదారులు అన్నింటినీ మూసివేయడంతో ఎక్కడా జన సంచారం లేదు. సెప్టెంబబరు 11 దాడుల తర్వాత అమెరికాలో ఉన్న నిర్మానుష్య పరిస్థితి ఇప్పుడూ కనిపిస్తోంది. విద్యుత్‌, రవాణా, సమాచార వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఎక్కడివారక్కడే నిలిచిపోయారు.తుపాను కారణంగా బలమైన చలిగాలులు వీస్తుండటంతో కరోలీనా నుంచి పెన్సిల్వేనియా వరకు ఎనిమిది నగరాలు మంచుతో నిండిపోయాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్యవసర పరిస్థితి ప్రకటించి, న్యూయార్క్‌, న్యూజెర్సీలకు సహాయ సిబ్బందిని పంపించారు. ఉదయం ఆయన ఫెడరల్‌ ఏజెన్సీలతో మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో ఏం చేయగలుగుతామో ఆలోచించి ఆ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఏజెన్సీ తన వంతు పని చేయాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఏ మేయర్‌, గవర్నరైనా తనను నిస్సందేహంగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. బుధవారం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మూతపడ్డ హైవేలు, సబ్‌వేలు విమానాశ్రయాలను తెరుస్తున్నారు. న్యూయార్క్‌లోని కెన్నడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని విమానాశ్రయాల్లో బుధవారం ఉదయం విమానసర్వీసులను పునరుద్దరించారు. అయితే వరదలతో పూర్తిగా ధ్వంసమైన లాగార్డియా విమానాశ్రయం మరికొద్దిరోజుల పాటు మూసివేసివుంచాలని అధికారులు నిర్ణయించారు. రెండు రోజుల పాటు మూసిఉన్న న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజి బుధవారం తెరుచుకోనుంది. దీనికి ప్రారంభ గంటను న్యూయార్క్‌ మేయర్‌ మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ కొట్టనున్నారు. న్యూయార్క్‌లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడానికి మరో రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయిన బెర్గాన్‌ కౌంటీలోని రెండు వేల మందిని రక్షించడానికి సహాయ సిబ్బందిని రంగంలోకి దింపారు.

తాజావార్తలు