అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ..

ముమ్మరంగా పోలింగ్‌
ఫలితం నేడే
భారత కాలమానం
ప్రకారం ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌
వాషింగ్టన్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి):
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. దేశ 45వ అధ్యక్షుడిని ఎన్నుకునేం దుకు 26 రాష్ట్రాలలో పోలింగ్‌ ముమ్మరంగా జరుగుతోంది. డేలవేరలో ఉపాధ్యక్షుడు జో బిడేన్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ప్రాంత రాష్ట్రాలలో ప్రారంభమైన పోలింగ్‌ మధ్య ప్రాచ్య రాష్ట్రాలలో కూడా కొనసాగనుంది. ఓహియో, నార్త్‌కరోలినా రాష్ట్రాలలో ఓటింగ్‌ పూర్తయింది. ప్లోరిడాలో
పోలింగ్‌ ప్రారంభం కానున్నది. అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి మిట్‌ రోమ్నీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. విజేతగా నిలిచేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు పొందేందుకు వీరు విపరీతంగా కృషి చేశారు. విజయాన్ని కొద్ది రాష్ట్రాలు మాత్రమే నిర్ణయించే అవకాశాలున్నాయి. తటస్థ రాష్ట్రాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. కొలరాడో, ప్లోరిడా, ఐవునా, మిచిగాన్‌, నెవడా, న్యూమెక్సిక్‌, ఉత్తర కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయించే అవకాశాలున్నాయని అంచనాలు వేస్తున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, మరికొన్ని రాష్ట్రాల్లో డెమోక్రాట్లు అధిపత్యంలో ఉన్నారు. దీంతో తటస్థ రాష్ట్రాలు ఎవరివైపు మొగ్గు చూపితే వారు విజయం సాధిస్తారు. అయితే ఆ తటస్థ రాష్ట్రాలు ఎటు మొగ్గు చూపుతాయనేది చెప్పడం కష్టంగానే ఉంది. ఈ రాష్ట్రాల ఓటింగ్‌ సరళిప్రత్యేకంగా ఉంది. రాష్ట్రాన్ని చూస్తే 2000, 2004 ఎన్నికల్లో రిపబ్లికన్లను బలపరిస్తే, 2008 ఎన్నికల్లో డెమ్కొటిక్‌ పార్టీ వైపు నిలిచారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రోరల్‌ కాలేజీ ప్రతినిధుల సంఖ్య సమానంగా ఉండదు. కాలిఫోర్నియాలో 55 మంది ఉంటే, పూర్తి గ్రామీణ ప్రాంతమైన మెంటానాలో మూడు స్థానాలు మాత్రమే ఉన్నాయి. సర్వేలు మాత్రం రోమ్నీపై ఒబామాకే ఆధిక్యతను చూపుతున్నాయి. తూర్పు అమెరికాలోనూ మిడ్‌వెస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు తెల్లవారు జామునే తెరుచుకున్నాయి. మొత్తం 17 కోట్ల మంది ఓటర్లున్నారు. రోమ్నీ అత్యంత సంపన్నుల్లో ఒకరు, రోమ్నీ గెలిస్తే అమెరికాలోని సంపన్నుడైన నాయకుడు శ్వేతసౌధంలోకి అడుగుపెడతాడు. ఆర్థిక పరిస్థితి పుంజుకోవడంలో వైఫల్యం, నిరుద్యోగ సమస్య వంటివి ఈ సమరంలో ప్రధానాంశాలు అయ్యాయి. మధ్య మధ్య ఇరువురి మధ్య వ్యక్తిగత ఆరోపణలు కూడా చోటు చేసుకున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు ఓటింగ్‌ జరిగే అవకాశాలున్నాయి.