అమెరికా అధ్యక్ష బరిలో బాబి జిందాల్… నేడో రేపో అధికారిక ప్రకటన
అమెరికా అధ్యక్షబరిలో భారతసంతతికి చెందిన అమెరికా కోటీశ్వరుడు, లూసియానా గవర్నర్ బాబి జిందాల్ పోటీపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే శ్వేతసౌథం అధిపతి ఎన్నికల రేసులో తొలిసారి భారత సంతతికి చెందిన అమెరికన్ పోటీపడటం చరిత్రలో ఇదే తొలిసారి.
అయితే, బాబీ జిందాల్ పోటీపై కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు రిపబ్లికన్ పార్టీ నేత అయిన బాబీ జిందాల్ తెరదించుతూ… పోటీకి సిద్ధమైనట్టు ప్రకటించారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఒకటి రెండు రోజుల్లో న్యూ ఆర్లీన్స్‌లో జరిగే సభలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య 12 మందికి చేరింది.
మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ పోటీ పడుతున్న విషయం తెల్సిందే. ఈమె ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించి దూసుకెళుతోంది. ఈ పార్టీలో పోటీలో ఎవరున్నప్పటికీ.. గెలుపు అవకాశాలు మాత్రం ఆమెకే ఎక్కువగా ఉన్నట్టుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ – ఎన్.బి.సి నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అంటే హిల్లరీకి 75 శాతం మంది, మరో అభ్యర్థి బేర్నీ శాండర్స్‌కు 15 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నట్టు ఈ సర్వేలో తేలింది.