అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధం – జో బైడెన్‌

 

వాషింగ్టన్‌,నవంబరు 8 (జనంసాక్షి): అమెరికా అభివృద్ధికోసం కలిసి పనిచేయడానికి సిద్ధమని, అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసమే ఓటు వేశారని చెప్పారు. అమెరికా ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు పనిచేస్తామని ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్‌ అద్భుతమైన నాయకురాలని ప్రశంసించారు. దేశ ప్రజలు ఆశిస్తున్న పాలనను అందించేందుకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బైడెన్‌ సొంతరాష్ట్రం డెలావర్‌లోని వెల్లింగ్టన్‌లో మొదటిసారిగా డెమొక్రాట్ల విజయోత్సవ సభ ఏర్పాటుచేశారు. ఇందులో జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ ప్రసంగించారు. తొలి మహిళను కావచ్చు.. కానీ తానే చివరి కాదుఎన్నికల్లో ఓడిన ట్రంప్‌ తనకు శత్రువేవిూ కాదని, మనమంతా అమెరికన్లమని బైడెన్‌ స్పష్టం చేశారు. అంతా కలిసి దేశం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే సోమవారం కరోనా నియంత్రణపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికాలో ప్రతి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేస్తామని, దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తానని ప్రకటించారు. రిపబ్లికన్లతో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య తేడాను చూపబోనని స్పష్టం చేశారు. అమెరికన్లు ఇప్పుడిచ్చిన తీర్పు దేశాభివృద్ధి కోసమేనని నమ్ముతున్నాని చెప్పారు. పరస్పర సహకారంతోనే ముందుకు నడవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అమెరికన్లు కలిసి ముందుకు సాగితే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు.