అమెరికా ఎంబసీ సవిూపంలో పేలుడు
ఒకరు మృతి..పలువురికి గాయాలు
కాబూల్,ఆగస్ట్29(జనంసాక్షి): అఫ్గనిస్తాన్‌లో మరోమారు పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని కాబూల్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అత్యంత భద్రత కలిగిన అమెరికా ఎంబసీకి సవిూపంలో మంగళవారం పేలుడు ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎంబసీకి కొద్ది దూరంలో ఉన్న కాబూల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రవేశమార్గంలో ఈ పేలుడు సంభవించినట్లు ఆ దేశ ¬ంశాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానిశ్ తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో 8 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో అమెరికా ఎంబసీతో పాటు పలు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలున్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఎంబసీలను లక్ష్యంగా చేసుకుని గతంలోనూ దాడులు జరిగాయి. దీంతో తాజా దాడి కూడా తాలిబన్ల పనే అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.