అమెరికా ఓటర్లలో కరోనా భయం

ముందస్తు ఓటింగ్‌లో అధికుల ఓటు
వాషింగ్టన్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పోలింగ్‌కు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో  అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. కరోనా ఉద్ధృతి వేళ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసేందుకు భయపడుతున్న అమెరికన్లు బ్యాలెట్‌, ఈమెయిల్‌ ద్వారా ముందస్తుగా రికార్డుస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా అందులో దాదాపు 5కోట్ల 90లక్షల మందికి పైగా ఓటు వేశారు. అమెరికాలో ఇప్పటివరకు నమోదు కానంత స్థాయిలో టెక్సాస్‌ రాష్ట్రంలో అత్యధిక ముందస్తు ఓటింగ్‌ శాతం నమోదైంది. పోలింగ్‌ శాతం గతంలో కంటే భారీగా  నమోదవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటేసేందుకు భయపడుతున్న అమెరికన్లు.. బ్యాలెట్‌, ఈ మెయిల్‌ ద్వారా ముందుగానే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ముఖ్యమైనదే. అందుకే ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేని వారికి సుదూర ప్రాంతాలలో ఉన్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. అమెరికన్‌ మహిళా వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబర్‌ 3వ తేదీన జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆమె తన ఓటు వేశారు. ఓటింగ్‌ జరిగే రోజున తాను స్పేస్‌లో ఉంటానని అందుకే ఈ ఓటు వేసినట్లు రూబిన్స్‌ చెప్పింది.  మొత్తం 24 కోట్ల మంది ఓటర్లలో దాదాపు నాలుగోవంతు ఓటర్లు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకోవడం అమెరికా చరిత్రలోనే ఓ రికార్డు. ఇంకా చెప్పాలంటే 2016లో పడిన మొత్తం ఓట్లలో 42 శాతం ఈసారి ఎన్నికల్లో ముందస్తుగానే బ్యాలెట్లకు చేరాయి. 16 కీలక రాష్ట్రాల నుంచే ఈ మొత్తం ఓట్లు పడ్డాయి. కరోనావైరస్‌ ఉధృతంగా కాటేస్తుండడంతో బయటకు- అంటే పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి సాహసించని ఓటర్లు ఈసారి పోస్టల్‌, ఈమెయిల్‌ బ్యాలెటింగ్‌కు మొగ్గుచూపారు. నవంబరు 3నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చంటున్నారు.
ఈ ముందస్తు ఓటింగ్‌ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చని,  ఎందుకంటే మొత్తం పోలింగ్‌ పూర్తయ్యాకే పోస్టల్‌, మెయిల్‌ ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుందని, ఈ లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని, పోలింగ్‌ జరగిన రోజు రాత్రే వెలువడడం అసాధ్యమని, కొన్ని రోజులపాటు సాగొచ్చని ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఇది 2016 కంటే ఎక్కువగా అరాచక పరిస్థితులకు దారితీసినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంది.