అమెరికా గవర్నర్‌ పోటీలో 14 ఏళ్ల కుర్రాడు

న్యూయార్క్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): అమెరికాలోని వెర్మోంట్‌ రాష్ట్రానికి చెందిన ఈథన్‌ సోన్నేబోన్‌ చదువుకోవాల్సిన వయసులో ఈథన్‌ రాష్ట్ర గవర్నర్‌ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈథన్‌ చరిత్ర సృష్టించినట్టే. ఇంకో విషయం ఏంటంటే వెర్మోంట్‌ రాష్ట్ర గవర్నర్‌ గా పోటీ చేసేందుకు కనీస వయసు నిబంధన లేకపోవడంతో ఇది సాధ్యమైంది. పిల్లాడు కదా.. వీడేం చేస్తాడులే అని అనుకోవద్దు. ఈ నెలలో జరిగే ఎన్నికల్లో తాను గెలిస్తే రాష్ట్రంలో చేపట్టబోయే సంస్కరణలు, అభివృద్ధి పనుల అజెండాను వివరిస్తున్నాడు. తుపాకుల విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ, పౌరులందరికీ ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నాడు. ఇంతకు ముందు గవర్నర్‌ ఎన్నికలలో గెలిచిన అత్యంత పిన్నవయస్కుడిగా ఎఫ్‌.రే.కైజర్‌(33) నిలిచారు. తాజా ఎన్నికల్లో ఈథన్‌ విజయం సాధిస్తే వెర్మోంట్‌ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన గవర్నర్‌ గా చరిత్ర సృష్టించనున్నాడు.