అమెరికా, చైనాల మధ్య మొదలైన..
వాణిజ్య యుద్ధం
– డ్రాగన్‌పై అమెరికా సుంకాలు అమల్లోకి
వాషింగ్టన్, జులై6(జనం సాక్షి) : ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా వేసిన దిగుమతి సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికా సుంకాలు విధించడంతో చైనా కూడా దీటుగానే స్పందిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా చర్యల కారణంగా తామూ ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తోందని, అమెరికా ఉత్పత్తులపై తాము కూడా దిగుమతి సుంకాలు విధించనున్నట్లు డ్రాగన్ గతంలోనే వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా చైనాకు చెందిన 34బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధించింది. ఈ సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. చైనీస్ యంత్రాలు, ఎలక్టాన్రిక్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్, ఎల్‌ఈడీలు వంటి వస్తువులపై ఈ సుంకాలు విధించారు. చైనా కూడా ధీటుగా చర్యలు తీసుకుంటుందని, డాలర్‌కు డాలర్ వసూలు చేస్తుందని హెచ్చరించింది. కానీ ఏం చర్యలు తీసుకోబోతోందనే విషయాన్ని వివరించలేదు. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వాణిజ్య యుద్ధానికి తెరలేపిందని.. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ ముందుకు తీసుకెళ్తామని చైనా అంటోంది. అయితే మరోవైపు అమెరికా ఇది ప్రారంభం మాత్రమే అని.. దాదాపు 450 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. చైనా కారణంగా తమకు పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఏర్పడుతోందని అమెరికా చెప్తోంది. గత ఏడాది చైనా ఉత్పత్తుల కారణంగా అత్యధికంగా 375.2 బిలియన్ డాలర్ల వాణిజ్య
లోటు ఏర్పడిందని అమెరికా స్పష్టంచేసింది.