అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాలు

మళ్ళీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు

ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాల కారణంగా అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. చమురు, లోహ రంగ షేర్లు నష్టపోవడం సూచీలను దెబ్బతీసింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి. సోమవారం లాభాలతో కళకళలాడిన మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ వంద పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా స్వల్ప నష్టంతో 10,230 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లో సాగిన మార్కెట్లు చివరకు కూడా నష్టాలనే మిగిల్చాయి. సెన్సెక్స్‌ 176.12 పాయింట్లు నష్టపోయి 33891.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 52.50 పాయింట్లు నష్టపోయి 10198.40 పాయింట్లకు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.64వద్ద ట్రేడవుతోంది.నేడు ఎన్‌ఎస్‌ఈలో టెక్‌ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గ్రాసిమ్‌, హెచ్‌యూఎల్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తదితర కంపెనీలు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, సిఎ/-లా, ఐఓసీ తదితర కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.