అమ్మఒడి కోసం ఎదురుచూపు
పథకం అమలులో పలువురు అసంతృప్తి
గుంటూరు,మార్చి7(జనం సాక్షి): అమ్మఒడి కింద .ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామంటున్నా .. జిల్లాలో వివిధ కారణాలు చూపుతూ వేలల్లో దరఖాస్తులను పక్కన పడేశారు. ఆయా కారణాలపై అభ్యంతరాలకు అవకాశం ఇచ్చినా ఇంతవరకు వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. వలంటీరు నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు ఇటు పాఠశాలల్లోనూ, అటు విద్యాశాఖ అధికారులు అమ్మఒడి తల్లుల గోడు గురించి పట్టించుకోవడంలేదు. జిల్లాలో అధికారులు చొరవ చూపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నారు. గతంలో ఏదైనా సమస్య వల్ల ఎక్కువమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మొత్తం యంత్రాంగం కదిలి వచ్చి పరిష్కరించేది. నేడు ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదని అమ్మఒడి నగదుని అందుకోలేకపోయిన తల్లులు వాపోతోన్నారు. తమ అభ్యంతరాలపై ఏమి చర్య తీసుకున్నారని వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందిని నిత్యం ప్రశ్నిస్తోన్నారు. ప్రతి రోజు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తూ తీవ్ర నిరాశతో ఇళ్లకు చేరుకుంటున్నారు. విద్యుత్ బిల్లుల్లో తప్పులు, ఆదాయపు పన్ను చెల్లించకపోతోన్నా చెల్లిస్తోన్నట్లుగా డేటా ఎంట్రీ, ఆధార్, బ్యాంకు అకౌంట్, రేషన్‌కార్డు నెంబర్లు తప్పుగా నమోదు చేయడం, విద్యార్థులకు 90శాతం పైగా హాజరు ఉన్నా లేనట్లుగా పేర్కొనడం, ఇల్లు, భూమి తక్కువ విస్తీర్ణం ఉన్నా ఎక్కువగా చూపించడం తదితర కారణాలతో జిల్లాలో లక్షా 339 మందికి అమ్మఒడి నగదు అందకుండా చేశారు. కొంత మంది అయితే స్పందనలో అభ్యంతరాలు పెట్టగా వాటిపై చర్య తీసుకున్నామని, అయితే ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోన్నామని పాఠశాల విద్యాశాఖ సమాధానాలు పంపించింది