అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..


దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన స్థిరాస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు కంపెనీలకు చెందిన దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉన్న రూ.970 కోట్ల విలువైన (రిజర్వ్‌ ధర) ఆస్తులను విక్రయించాలని భావిస్తోంది. హైదరాబాద్‌, చండీగఢ్‌, భావ్‌నగర్‌, కోల్‌కతాలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.660 కోట్ల విలువైన ఆస్తులతో పాటు వారాసి హిల్‌, ముంబయిలోని ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన రూ.310 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించనుంది. ఈ మేరకు దీపమ్‌ వెబ్‌సైట్‌లో ఆ వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది.తొలిదశ మానిటైజేషన్‌ ప్రక్రియలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన రూ.970 కోట్ల ఆస్తులను విక్రయిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ తెలిపారు. ఒకటిన్నర నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 14న ఎంటీఎన్‌ఎల్‌ ఈ`ఆక్షన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. 2019లో రూ.69వేల కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా ఈ మానిటైజేషన్‌ ప్రక్రియను చేపడుతున్నారు. 2022 నాటికి రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేయనున్నారు.