అమ్మ అనే పిలుపుతోనే కమ్మదనం: సీఎం మోడీ

ఢిల్లీ, జనంసాక్షి: ఫిక్కీ మహిళ సదస్సులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని తెలిపారు. అమ్మ అనే  పిలుపులో ఎంతో కమ్మదనం ఉందని మోడీ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల ద్వారా తనకు సమాచారం ఇవ్వాలని ఆయన మహిళలకు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియా వల్ల చాలా మంది సోదరీమణులతో అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక భారతదేశంలో మహిళా శక్తే కీలకమైందని పేర్కొన్నారు. మహిళల పట్ల ఈ సమాజం తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. తల్లి గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తారనే  కొడుకుపై శ్రద్ధ చూపుతున్నారని కాని కొడుకుకన్న కూతురే వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. ఆడపిల్లలు తగ్గడంతో పురుషుల పెళ్లిళ్లు ప్రశ్నార్థకమవుతున్నాయన్నారు. స్త్రీలకు సముచిత గౌరవం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.