అయోధ్యపై దీపావళి కానుక

యోగి ఫార్ములా అంటూ ప్రచారం

లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): అయోధ్యలో రామాలయం… ఏళ్లుగా ఎంతో మంది రామభక్తులు కంటున్న కల ఇది. తాజాగా దీనికి సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు మాత్రం దీపావళి రోజు శుభవార్త అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే శుక్రవారం చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ఓ శుభవార్త చెబుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యోగి ‘మహా రుషి’ అంటూ ఆకాశానికెత్తేసిన మహేంద్రనాథ్‌ పాండే.. అయోధ్యపై ఆయన చక్కని ప్రణాళికను రూపొందించే ఉంటారని కూడా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భయ్యాజీ జోషి కూడా అయోధ్యపై ఓ ప్రకటన చేశారు. అయోధ్య అంశంపై మాట్లాడుతూ దీపావళిలోపు గుడ్‌ న్యూస్‌ ఉంటుందన్నారు. అటు యూపీ బీజేపీ, ఇటు ఆర్‌ఎస్‌ఎస్‌ .. అయోధ్యను దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైన ప్రకటన చేయడం వెనక ఏదైనా ఉందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.