అయోధ్యలో భారీ రామవిగ్రహం

సరయూ తీరంలో ఏర్పాటు చేసే ప్రణాళిక

దీపావళికి ప్రకటన చేయనున్న సిఎం యోగి

లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): అయోధ్యలో సరయు నది తీరాన రాముడి భారీ విగ్రహ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 151 విూటర్ల ఎత్తైన రాముడి విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని ఉత్తరప్రదేశ్‌ భాజపా నేతల నుంచి సమాచారం. దీపావళి దీపోత్సవం సందర్భంగా అయోధ్యకు వెళ్లనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉందని స్థానిక భాజపా నేతలు చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపావళికి శుభవార్త అంటూ వస్తున్న వార్తల వెనక ఇదే అయివుంటుందని భావస్తున్నారు. సరయు తీరంలో భూమిని పరిశీలించిన తర్వాత ఏ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తారు. సంత్‌ తులసీదాస్‌ ఘాట్‌ సవిూపంలో రాముడి విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధికారులు తగిన చోటు కోసం రెండు, మూడు ప్రదేశాలు పరిశీలిస్తున్నారు’ అయోధ్య మేయర్‌ రిషికేష్‌ ఉపాధ్యాయ్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. రామ జన్మభూమి అయిన అయోధ్య విషయంలో యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ప్రణాళికలు ఉన్నాయని, దీపావళి నాడు శుభ వార్త వింటారని రాష్ట్ర భాజపా చీఫ్‌ మహేంద్రనాథ్‌ పాండ్యా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన 182 విూటర్ల సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిని యోగి కూడా సందర్శించారు.