అయోధ్య తీర్పును స్వాగతించిన ఆరెస్సెస్‌ 

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్‌ స్వాగతించింది. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌  వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అయోధ్య కేసులో తీర్పు జాప్యమైనా తాజా తీర్పును స్వాగతిస్తామని అన్నారు. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తామని స్పష్టం చేశారు. అయోధ్య వివాదంపై గతంలో మధ్యవర్తిత్వ పక్రియ విఫలమైందని అన్నారు. భారతీయులను హిందూ, ముస్లింలుగా తాము చూడబోమని చెప్పారు.
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం: బాబారాందేవ్‌
అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని యోగా గురు బాబా రాందేవ్‌ వ్యాఖ్యానించారు. మతాలు
వేరైనా మనమంతా రాముడి వారసులమేనని అన్నారు. సుప్రీం తీర్పుతో అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్టేనని చెప్పారు. అయోధ్య వివాదంసై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేలా సాధుసంతులు, బీడియా వ్యవహరించాలని సూచించారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు.