అయ్యప్ప విషయంలో ఆచారాలే వారికి ముఖ్యం

అందుకే స్థానిక మహిళలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు

ఇదేదో కుట్ర రాజకీయంగా చూడడం తగదు

తివనంతపురం,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): శబరిమల ఆలయంలోకి అన్ని వయసులకు చెందిన మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తరవాత కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళన మొదలయ్యింది. ఇందులో మహిళలే అధికంగా పాల్గొని తీర్పునకు వ్యతిరేకంగా సన్నిధానంనకు మహిళలు వెళ్లకుండా అడ్డుకున్నారు. కట్టుబాట్లు, ఆచారాల్లో సుప్రీం జోక్యాన్ని నిరసించారు. మహిళలు వస్తే తాళాలేసి వెళ్లిపోతానని అయ్యప్పస్వామి ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారు. ఇటీవలే వరదల్లో సర్వం కోల్పోయిన కేరళవాసులు ఇంతగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపితే ఇదేదో ఆర్‌ఎస్‌ఎస్‌ చేసిందని చెప్పి అధికార లెఫ్ట్‌ పార్టీకి చెందిన సిఎం పినరయ్‌ విజయ్‌, సీతారాం ఏచూరీ లాంటివారు విమర్వలు చేశారు. ఇదో రకంగా అక్కడి ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదు. కట్టుబాట్లపై ప్రజల్లో ఉన్న భావనలను అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్న విషయం రాజకీయ నేతలు గుర్తుంచుకుంటే మంచిది.

ప్రజల ఆందోళనల వెనక బిజెపి-ఆరెస్సెస్‌, ఇతర మితవాద శక్తులు ఉన్నాయని చెప్పడం ద్వారా స్థానిక మహిళలను కూడా అవమానించారు. నిజానికి వారంతా బిజెపి వెనక ఉంటే లెఫ్ట్‌ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చేదా అన్నది ఆలోచించాలి. సుప్రీం కోర్టు తీర్పును పురస్కరించుకుని కొంత మంది మహిళా జర్నలిస్టులు శబరిమల బస్సు ఎక్కుతుంటే, వారిని ఆందోళనకారులు బలవంతంగా దించేశారు. భక్తుల విశ్వాసాలను పట్టించుకోకుండా ఆలయాన్ని దర్శించుకుంటామని కేరళకు చెందిన ఒక్క మహిళా

ముందుకు రాలేదు. ఈ విసయాన్ని విమర్శకులు గమనించాలి. కొందరు ఫాసిస్ట్‌ సిద్దాంతాలను ప్రోత్సహించే వారే పవిత్రతను పక్కన పెట్టి ముందుకు వచ్చారు. విశ్వాసాలు, ఆచారాల పేరుతో ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలాలి గానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదు. ఆలయాల్లో ప్రవేశానికి సంబంధించి మహిళలకు సమానత్వ హక్కును కల్పించిన సుప్రీం కోర్టు తీర్పు అమలుకు కట్టుబడి వున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. అయితే సుప్రీం తీర్పుతో పాటు ఈ ఆచయారం వెనక ఉన్న బలమైన కారణాలను కూడా కోర్టుకు వివరించాలి.కేవలం ఇదో ఆరెస్సెస్‌, బిజెపిల కుట్రగా విమర్వలు చేయడం కుసంస్కారం తప్ప మరోటి కాదు. ప్రగతిశీల ఉద్యమాలకు, సంఘ సంస్కరణోద్యమాలకు నెలవైన కేరళలో అయ్యప్ప విషయంలో అక్కడి ప్రజలు ఇంతకాలం జోక్యం చేసుకోలేదు. ఇకముందు కూడా జోక్యం చేసువడానికి కూడా సిద్దంగా లేరు. అయ్యప్పను వారు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. స్త్రీ-పురుష సమానత్వం ఇక్కడ పాటించరు. అందుకే సుప్రీం తీర్పును కాంగ్రెస్‌ స్వాగతించినా కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల మాత్రం దీనిని వ్యతిరేకించారు. ఈ తీర్పును అమలు చేయొద్దని, దేవస్థానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేసారు. అంతేకాదు ఒక రోజు నిరాహార దీక్షకు కూడా కూర్చొన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉండే నమ్మకాలు వారిని ఇలా చేయించాయి. అయినంత మాత్రాన దీనిని కాంగ్రెస్‌ పార్టీకి లేదా బిజెపికి ఆపాదించి యాగీ చేయడం సరికాదు.