అరబ్‌షేక్‌ల చెరలో చిక్కుకున్న కరీంనగర్‌ మహిళ

కరీంనగర్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మహిళ అక్కడ షేక్‌ల చెరలో చిక్కుకుంది. పని ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌ రూ. 2 లక్షలకు ఆమెను అమ్మేశాడు. అక్కడ పడుతున్న కష్టాలను ఆమె ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది. తమ కుమార్తెను సొంతూరికి తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన అనురాధ ఏజెంట్‌ మాటలు నమ్మిన ఈమె ఇప్పుడు మస్కట్‌లోని ఓ షేక్‌ ఇంట్లో గృహనిర్బంధంలో ఉంది. లింగారెడ్డి అనే ఏజెంట్‌ అనురాధకు మాయమాటలు చెప్పాడు. దుబాయ్‌లో పని ఇప్పిస్తానని, నెలకు. రూ. 30 వేలు సంపాదించుకోవచ్చునని నమ్మించి రూ. 2లక్షలకు అమ్మేసాడు. భర్తతో విడాకులు తీసుకుని, తన కూతురుతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న అనురాధ తల్లిదండ్రులకు భారం కాకుండా ఎంతో కొంత సంపాదించుకోవచ్చుననే ఆశతో లింగారెడ్డి మాటలు నమ్మింది. విజిటింగ్‌ విసా ఇప్పించిన ఏజెంట్‌ ఆమెను మస్కట్‌లోనే మరో ఏజెంట్‌కు అమ్మేసాడు. ఆ ఏజెంట్‌ ఆమెను ఓ షేక్‌ ఇంట్లో అప్పగించాడు. మూడు నెలలు గడుస్తున్నా పైసా ఇవ్వకుండా కష్టాలు పెడుతున్నారని, అడిగితే గదిలో నిర్బంధించి కొడుతున్నారని అనురాధ తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఏజెంట్‌ లింగారెడ్డి మరో 12 మందిని ఇలాగే పంపినట్లు అనురాధ తెలిపింది.