అరవింద పబ్లిక్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి)

నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గల అరవింద పబ్లిక్ స్కూల్ లో ప్రిన్సిపాల్ పంచకం రమాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు సాంప్రదాయ దుస్తులతో చక్కగా అలంకరించుకొని, తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం వాటన్నీటిని ఒక చోట పెట్టి వాటి చుట్టూ చేరి ఆడిన ఆటపాటలు, కోలాటాలు, నృత్యాలు అలరింప చేశాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ పంచకం నర్సయ్య మాట్లాడుతూ ప్రకృతిని పవిత్రంగా ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ అని, తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం బతుకమ్మ అని అన్నారు. పువ్వుల్ని పూజించడం ఈ పండుగ గొప్పతనం అని భక్తి శ్రద్దలతో తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారని అన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పంచకం నర్సయ్య విద్యార్థులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.