అర్ణబ్‌ బిల్లులు ఎగబెట్టాడు

– అందుకు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు

– అర్ణబ్‌ అరెస్టుపై అన్వే నాయక్‌ కుటుంబ సభ్యుల హర్షం

ముంబై,నవంబరు 4 (జనంసాక్షి): రిపబ్లిక్‌ టీవీ సీఈవో అర్ణబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై బాధిత కుటుంబం స్పందించింది. మహారాష్ట్ర పోలీసులకు మృతుడి భార్య అక్షిత, కుమార్తె అద్యా నాయక్‌ ధన్యవాదాలు తెలిపారు. అర్నబ్‌ అరెస్ట్‌తో తమకు ఇప్పటికైనా న్యాయం జరిగిందని వారు అన్నారు. రిపబ్లిక్‌ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో 2018లో 53 ఏండ్ల ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వే నాయక్‌, ఆయన తల్లి కుముద్‌ నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై అన్వే కుమార్తె అద్యా పలుసార్లు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అర్నబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై అన్వే నాయక్‌ భార్య, కుమార్తె స్పందించారు. 2018లో జరిగిన ఘటనను తాము ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. ‘నా భర్త ఆత్మహత్య లేఖలో ముగ్గురు పేర్లను ప్రస్తావించారు. అయితే వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా భర్త మరణానికి అర్నబ్‌ గోస్వామే కారణం. అతడికి సహాయం చేయవద్దని ప్రతి ఒక్కరిని వేడుకున్నా. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసుల చర్యతో మాకు న్యాయం జరిగింది. మహారాష్ట్ర కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు’ అని అక్షిత నాయక్‌ తెలిపారు. కాగా, రిపబ్లిక్‌ టీవీ ప్రాజెక్టు కోసం తన తండ్రి తన డబ్బు, శక్తి, రక్తాన్ని ధారపోశారని కుమార్తె అద్వా చెప్పారు. ఇంత చేసినప్పటికీ నా తండ్రికి బకాయిలు చెల్లింపునకు గోస్వామి ముందుకు రాలేదని విమర్శించారు. నా తండ్రి జీవితంతోపాటు నా జీవితాన్ని కూడా నాశనం చేస్తానంటూ అర్నబ్‌ నిరంతరం బెదిరించారని ఆమె ఆరోపించారు. తన తండ్రి ఆత్మహత్య కేసుపై మాజీ దర్యాప్తు అధికారి సురేష్‌ వాడరే తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అద్వా విమర్శించారు. ‘నా తండ్రి సూసైడ్‌ నోట్‌, పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ కోసం 2019 ఫిబ్రవరి, మార్చి మధ్యలో అలీబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాం. దర్యాప్తు అధికారి సురేశ్‌ సంతకం చేయాలంటూ ఒక పేపర్‌ ఇచ్చారు. తాము ప్రతీకారం కోసమే ఫిర్యాదు చేశామని, ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్లుగా అందులో ఉన్నది. అది చదివిన తర్వాత ఫోటో తీసేందుకు ప్రయత్నించగా ఆ అధికారి దానిని చింపివేశారు. మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు’ అని అద్యా ఆరోపించారు. అర్నబ్‌ ఏమైనా దేవుడా, నిందితుడైన అతడికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ముంబై పోలీస్‌ కమిషనరేట్‌లో అర్నబ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని చెప్పారు. ఆ సమయంలో ఆ పోస్టులో ఉన్న మాజీ పోలీస్‌ కమిషన్‌ సంజయ్‌ బార్వేను కలిశామని, రాయగఢ్‌ ఎస్పీ అనిల్‌ ప్రకాష్‌ను పలుమార్లు కలవడంతోపాటు ప్రధాని కార్యాలయానికి పలుసార్లు లేఖలు రాసినా తమకు ఎవరూ సహాయం చేయలేదని అద్వా ఆరోపించారు. మా తండ్రి ఆత్మహత్య కేసును మూసివేసినట్లు తెలిసి షాక్‌కు గురయ్యామని ఆమె చెప్పారు. ‘ఈ ఏడాది మే 5న నా తండ్రి వర్థంతి సందర్భంగా మా బాధను వ్యక్తం చేస్తూ వీడియోలను పోస్ట్‌ చేశాం. కొన్ని రోజుల తర్వాత ఆ కేసును మూసివేసినట్లు రిపబ్లిక్‌ టీవీ ట్విట్టర్‌లో ప్రకటన ఇచ్చింది. దర్యాప్తును తొక్కిపెట్టి కేసును మూసివేశారన్న సంగతి అప్పుడే మాకు తెలిసింది. దీంతో ఈ కేసు గురించి మరోసారి ఫిర్యాదు చేశాం. మాకు వచ్చిన బెదిరింపులపై రెండు పోలీస్‌ స్టేషన్లలో నాలుగుసార్లు ఫిర్యాదు చేశాం’ అని అద్యా చెప్పారు. విూకు ఏ రాజకీయ పార్టీ మద్దతిస్తున్నది అని విూడియా వారిని ప్రశ్నించగా ఆమె ఘటుగా బదులిచ్చారు. ‘ఈ అంశాన్ని రాజకీయం చేయడం మాకు ఇష్టం లేదు. మాకు న్యాయం మాత్రమే కావాలి. నిజాయితీగా దర్యాప్తు జరుగాలి’ అని అద్వా సమాధానమిచ్చారు.