అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

లేబర్‌ మార్కెట్‌పై ముగ్గురు కొత్త అంశాల ప్రస్తావన
స్టాక్‌హోమ్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డీ. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లు.. ఎకనామిక్స్‌ నోబెల్‌ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్‌ కార్డ్‌కు సగం పురస్కారం దక్కగా.. మరో ఇద్దరు సగం ప్రైజ్‌మనీ పంచుకోనున్నారు. లేబర్‌ మార్కెట్‌ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్‌ కమిటీ వెల్లడిరచింది. అమెరికాలోని బెర్క్‌లే లో ఉన్న కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ కార్డ్‌కు సగం బహుమతి దక్క నున్నది. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్‌ కొన్ని సూచనలు చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ టెక్నాలజీ ఇన్స్‌టిట్యూట్‌ ప్రొఫెసర్‌ జాషువా, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గైడో ఇంబెన్స్‌లు.. క్యాజువల్‌ రిలేషన్‌షిప్స్‌ను విశ్లేషించారు. సహజ పరిశోధనల ద్వారా ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు సంచలనాత్మక అంశాలను వెల్లడిరచారు. సామాజిక శాస్త్రంలో చాలా వరకు అంశాల్లో.. కారణం ఏంటి, దాని ప్రభావం ఏంటన్న రీతిలోనే ఉంటాయి. అయితే అలాంటి విషయాలపై ఈ ముగ్గురూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్‌ వల్ల జీతంపై ప్రభావం ఉంటుందా.. ఉద్యోగంలో మార్పు ఎలా ఉంటుందన్న లాంటి అంశాలను స్టడీ చేశారు. పెద్ద చదువులు చదవడం వల్ల భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుంది. నిజానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఈజీ కాదు. అయితే ఇలాంటి ప్రశ్నలకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సహజమైన రీతిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.