అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం

ముంబయి జనవరి 21 (జనం సాక్షి):

టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ బార్క్‌ సీఈవో పార్థో దాస్‌ గుప్తాల వాట్సాప్‌ చాట్‌ పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన బాలాకోట్‌ స్ట్రైక్స్‌ గురించి అర్నబ్‌కు ముందే సమాచారం ఉన్న ట్లుగా ఆ సంభాషణల్లో వెల్లడైంది. ఒకరకంగా ఇది అధికారిక రహస్యాల చట్టానికి తూట్లు పొడవడమే. కేబినెట్‌ మంత్రులకు కూడా తెలియనివ్వకుండా అ త్యంత సీక్రెట్‌గా రక్షణ శాఖ చేపట్టే ఆపరేషన్స్‌ గు రించి అర్నబ్‌కు ముందే తెలియడం… దాన్ని ఇత రులతో షేర్‌ చేసుకోవడం తీవ్ర సంచలనం రేకెతి ్తస్తోంది.జాతీయ భద్రతకు భంగం కలిగించేలా… ఫిబ్రవరి 26,2019న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరపగా… అంతకు మూడు రోజుల ముందే ఫిబ్రవరి 23న అర్నబ్‌ ఈ విషయాన్ని వాట్సాప్‌ ద్వారా పార్థో దాస్‌ గుప్తాతో పంచుకున్నాడు. మిలటరీ అత్యంత రహస్యంగా చేపట్టే ఈ ఆపరేషన్‌ గురించి అర్నబ్‌కు ముందస్తు సమాచారం అందడమంటే… దేశ రక్షణ విషయాలు బయటకు లీకవుతున్నాయనే సందేహాలు తలెత్తకమానవు. ఒకవేళ ఈ రహస్యాలు ప్రత్యర్థి దేశాలకు చిక్కితే రక్షణ శాఖ చేపట్టే ఆపరేషన్స్‌ నిలిచిపోక తప్పదు. అదే జరిగితే దేశ ప్రయోజనాలకు,జాతీయ భద్రతకు తీవ్ర భంగం,ముప్పు వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే అర్నబ్‌ చేసిన పనిని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

అర్నబ్‌ అరెస్టుకు సిద్దమవుతోన్న మహారాష్ట్ర ప్రభుత్వం? ఈ వ్యవహారంలో అర్నబ్‌ అరెస్టుకు సంబంధించి న్యాయ నిపుణులు,సీనియర్‌ అధికారుల సలహాలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ¬ంమంత్రి అనిల్‌ దేశ్‌ ముఖ్‌ వెల్లడించారు.అధికారిక రహస్యాల చట్టం కింద అర్నబ్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదన్నారు. అర్నబ్‌కు ఆ సమాచారం ఎలా లీకైంది… అతనితో పాటు ఇంకెవరికైనా ఈ సమాచారం ముందుగానే తెలిసిందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందన్నారు.

జాతీయ భద్రతే ముఖ్యమన్న ¬ంమంత్రి..
టీఆర్పీ కుంభకోణం కేసు విచారణలో భాగంగా అర్నబ్‌ వాట్సాప్‌ చాట్‌ వెలుగుచూసిందని అనిల్‌ దేశ్‌ ముఖ్‌ అన్నారు. ఈ కేసులో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తమ పరిధిలో ఏమి చేయగలమో చేస్తామని అన్నారు. రాష్ట్ర,జాతీయ భద్రతే తమకు అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అంతకుముందు మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ¬ంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కలిసి అర్నబ్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

ఆ విషయాలు ఎవరు చేరవేశారు?
బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాటు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు కూడా అర్నబ్‌కు ముందే తెలుసన్న విషయం ఇటీవల లీకైన వాట్సాప్‌ చాట్‌లో సంభాషణలతో స్పష్టమవుతోంది. అంతేకాదు,పుల్వామాలో 40 మంది భారత జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేసి హతమారిస్తే… ఆ ఘటన ద్వారా తన టీవీ చానెల్‌కు టీఆర్పీ పెరిగిందని అర్నబ్‌ వాట్సాప్‌ చాట్‌లో పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే టీఆర్పీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్నబ్‌… ఇప్పుడు జాతీయ భద్రతకే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.