అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ధృవపత్రాల కోసం ప్రజలు ఇక్కట్లు
ఖమ్మం, జూలై 19: ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయం చుట్టు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు జరగవు. రోజుల తరబడి చిన్నచిన్న సర్టిఫికేట్ల కోసం, ధృవపత్రాల కోసం ఇతర పనుల నిమిత్తం తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో కావాల్సిన పనులకు కూడా నెల రోజులు తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కో రోజు 12 లేదా 1 గంట వరకు ఎమ్మార్వో, ఆర్ఐ, ఇతర సిబ్బంది కార్యాలయానికి రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ తహశీల్దార్‌ను కలవాలని వస్తే కార్యాలయంలో సరిగా సమాచారం ఇచ్చే నాథుడే కరవయ్యాడు. ఒకవేళ చెప్పినా కూడా క్యాంపుకు వెళ్లారని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఆయన వచ్చే వరకు చెట్ల కింద, రోడ్ల వెంబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చుకోవడానికి, ఓటర్ గుర్తింపు కార్డు కోసం అనేక సార్లు పలు పనుల నిమిత్తం దరఖాస్తులు, పోటోలు ఇస్తూనే ఉన్నాం కానీ ఆ పనులు మాత్రం కావడం లేదని, ఇకనైనా జిల్లా కలెక్టర్ అర్బన్ కార్యాలయంలో పరిస్థితి చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.