అర్హత ఉన్నా… ఆసరా సున్నా!

•ఆసరా వృద్ధాప్య పింఛను మంజూరులో  అర్హులకు మొండి చేయి*
బయ్యారం, ఆగష్టు 31(జనంసాక్షి):
వృద్ధాప్యంలో  ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వృద్ధాలకు చేయూతనిస్తుంది.ముఖ్య మంత్రి కెసిఆర్ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి  ఆసరా అందించాలనే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించలేదు.అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల వైఫాల్యమో గాని క్షేత్ర స్థాయిలో లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవల బయ్యారం మండలంలోని ఆసరా పింఛను నూతన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ చేతులమీదుగా బయ్యారంలో అందజేశారు. కాగా అర్హత ఉన్నా,57 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సరిపోలినప్పటికీ పదుల సంఖ్యలో అర్హులకు ఆసరా పింఛను మంజూరు కాలేదు.పోనీ ఈసారి లబ్ధిపొందని అర్హత ఉన్న వారుగాని,కొత్త దరఖాస్తుదారులుగాని తిరిగి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే విషయమై అధికారులు గానీ, ప్రభుత్వం గానీ మార్గదర్శకాలు సూచించలేదు. కానీ కొన్ని దినపత్రిక లో, సొషల్ మీడియా వేదికగా ఈనెల 31 వరకు ఆసరా పింఛను నమోదుకు అవకాశం ఉందని,స్థానిక మీసేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.కాని మీసేవ నిర్వాహకులు మాత్రం అలాంటిదేమి లేదని, దరఖాస్తుకు సంబందించిన లింక్ మీసేవ పోర్టల్ లో అందుబాటులో లేదని వివరించారు.ఇదే విషయమైన అధికారులను వివరణ కోరగా ఆసరా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తిరస్కరణ ఏ కారణంచేత జరిగిందనే విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని, ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు విలువడే వరకు వేచి చూడాలని, ఏదైనా సమాచారం ఉంటే అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయేసరికి పత్రికలో, వాట్సాప్ గ్రూపులో వచ్చినా సందేశాలను నమ్మాలో లేదో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.