అలంపూర్‌పై వరాల జల్లు

C

– ఆర్డీఎస్‌ త్వరితగతిన పునరుద్ధరణ

– 87,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం

– వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం

– గొందిమళ్లలో సీఎం కేసీఆర్‌ పుష్కర స్నానం

హైదరాబాద్‌,ఆగస్టు 12(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి కృష్ణానదిలో పుష్కరస్నాన మాచరించడంతో పుష్కర యాత్ర మొదలయ్యింది. ఇరు రాష్ట్రాల్లో భారీగా ఏర్పాట్లు చేయడంతో పాటు, పుష్కర ఘాట్లలో నీటి సమస్య లేకపోవడంతో భక్తలు ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ మండలం గొందిమళ్ల ఘాట్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పుష్కర స్నానమాచరించారు. జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ముహూర్తం ప్రకారం సరైన లగ్నంలో పుష్కరాలు ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా పుష్కలంగా వానలు కురవాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. పుష్కరాలు రావడం చాలం సంతోషం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలను పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరం అంటే బెజవాడ, గోదావరి పుష్కరం అంటే రాజమండ్రిలా ప్రచారం చేశారు. గత సంవత్సరం గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.  కృష్ణా పుష్కరాలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నాం.  పుష్కర స్నానం తరువాత దైవ దర్శనం చేసుకోవడం ఆచారం. పుష్కర స్నానం చేసి శక్తి పీఠాన్ని దర్శించుకునే అరుదైన స్థలం అలంపూర్‌ కావడం, ఐదవ శక్తిపీఠం అలంపూర్‌ జోగులాంబ సన్నిధికి ఎందరో అమ్మవారి ఉపాసకులు వస్తుంటారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  పుష్కర స్నానం తర్వాత ముఖ్యంగా చేయాల్సింది దైవదర్శనం. ఒక్క అలంపూర్‌లోనే ఇలాంటి అద్భుత భాగ్యం లభిస్తుందని వివరించారు. ముహూర్తం ప్రకారం సరైన లగ్నంలో పుష్కరాలు ప్రారంభించుకున్నామన్నారు. అలంపూర్‌ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం, అలంపూర్‌లో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. గత పాలకుల నిర్వాకం వల్ల పుష్కరాలు ఆంటే ఆంధ్రా ప్రాంతంలోనే జరిగేవి. తెలంగాణ ఆలయాలను పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌తో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు. మారుమూల నియోజకవర్గంగా ఉన్న అలంపూర్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అమ్మవారి దయతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. వర్షాలు పుష్కలంగా పడి ప్రాజెక్ట్‌లన్నీ నిండాలని ఆకాంక్షించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. ప్రతి ఏడాది 5వేల నుంచి 10 వేలమంది ఉపాసకులు అలంపూర్‌ వచ్చి వెళ్తుంటారన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధిపై ప్రధానితో మాట్లాడుతానని సీఎం అన్నారు.  సమైక్య పాలనలో జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని విమర్శించారు. ఆర్డీఎస్‌ కింద 87,500 ఎకరాలకు నీరు రావాల్సిందే అని తేల్చిచెప్పారు. తుమ్మిళ్ల లిఫ్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ చేరుకున్న సిఎం కెసిఆర్‌సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు  చేరుకున్నారు. హెలికాప్టర్‌ ద్వారా ఆయన ఆలంపూర్‌ నుంచి నగరానికి వచ్చారు. కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు గురువారం  సాయంత్రం ఆయన అలంపూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.  ఉదయం 5.58 నిమిషాలకు గొందిమల్ల పుష్కరఘాట్‌ వద్ద పుణ్య స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం అలంపూర్‌లోని 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కాగా కృష్ణా పుష్కరాల కోసం నగరం నుంచి వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ అటు దక్షిణమధ్య రైల్వే.. సాధారణ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడిపిస్తున్నాయి. మొత్తం 665 బస్సు సర్వీసులను పుష్కరాల కోసం నడుపుతున్నప్పటికీ తెలంగాణ నుంచే 422 సర్వీసులను ఆపరేట్‌ చేస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంతం మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో ఉండడంతో అక్కడి వరకు ప్రయాణికులను చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాల్లో విజయవంతంగా సేవలు అందించిన టీఎస్‌ఆర్టీసీ అదే ఉత్సాహంతో సేవలందించేందుకు సిద్ధమైంది. కేవలం టీఎస్‌ఆర్టీసీ బస్సులను మాత్రమే పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లేలా అనుమతులు తీసుకున్నారు. అలాగే, హైదరాబాద్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌ నుంచి 52 రైళ్లు 422 సర్వీసులుగా నడుస్తాయి. నగరం నుంచి గంటకో రైలు, ఐదు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్‌-గద్వాల ఉ. 11.45, మ. 3.30, గద్వాల-సికింద్రాబాద్‌ సా. 4.30, రాత్రి 9.00, బొల్లారం-గద్వాల ఉ.7 గంటలకు, మ. 1.00, గద్వాల-బొల్లారం 2.30, రాత్రి 7.45, గద్వాల-కర్నూలు మ. 3.00, రాత్రి 4.45, కర్నూలు-గద్వాల మ. 12.45, మ. 1.50. మధ్య సర్వీసులు నడుపుతున్నారు. యాత్రికుల ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సులు రానున్నాయి. 30 నుంచి 40 మంది రిజర్వేషన్‌ చేసుకుంటే ప్రయాణికులు కోరిన ప్రదేశం నుంచే బస్సులు ఎక్కించుకుంటారు. నేరుగా పుష్కర ఘాట్ల వద్ద దించుతారు. మళ్లీ పుష్కర ఘాట్ల వద్ద ఎక్కించుకుని ఇంటి వద్ద దించే సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. అంతేగాకుండా ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, టెలిఫోన్‌ భవన్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఐఎస్‌ సదన్‌, ఈసీఐఎల్‌, లింగంపల్లి, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడిపిస్తోంది. నాగార్జునసాగర్‌, బీచుపల్లి, శ్రీశైలం, సోమశిల, మట్టపల్లి, వాడపల్లి విజయవాడకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులను 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నడపనున్నారు. పుష్కరాల కోసం 1365 బస్సులను సిద్ధం చేశారు.