అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

కామారెడ్డి,మే31(జ‌నం సాక్షి):  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మైదానం సిద్దం చేశారు. ఉత్సావాల్లో బాగంగా జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలురంగాల్లో కృషి చేసిన వారికి జిల్లా స్థాయిలో పురస్కారాలు అందచేస్తారు. ఇకపోతే జూన్‌ 2వ తేదీలోగా జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చి ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని వేడుకల్లో సన్మానించుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చేందుకు ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, ఏపీఎంలు, ఫీల్డ్‌ స్టాఫ్‌ కృషి చేయాలన్నారు. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలకు 279 జీపీలు ఓడీఎఫ్‌గా ప్రకటించినట్లు తెలిపారు. 22 గ్రామాల్లో ఓడీఎఫ్‌ పనులు కొనసాగుతున్నాయని మిగతా గ్రామాల్లో అనుకున్న స్థాయిలో పనుల పురోగతి లేదన్నారు. ఈ గ్రామాలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఓడీఎఫ్‌ అయిన గ్రామాలకు సంబంధించిన సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎస్‌హెచ్‌ గ్రుపుల సహకారం కూడా తీసుకుని లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. నిధుల కొరత లేదనే విషయాన్ని గమనించి ఉత్సహంగా గ్రామాల్లో పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు.