‘అవని’ని అంతమొందించారు!


– బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు
ముంబయి, నవంబర్‌3(జ‌నంసాక్షి) : ఇప్పటి వరకు 13మందిని పొట్టపెట్టుకున్న ‘అవని’ అనే ఆడపులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అంతమొందించారు. దీంతో యవత్మాల్‌ ప్రాంతంలోని ప్రజలు బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ‘అవని’ అనే ఆడపులి 2012లో యవత్మాల్‌ అడవుల్లో తొలిసారి కనిపించింది. ఆ సవిూప ప్రాంతాల్లో రెండేళ్లలో పలు ఘటనల్లో పులి కారణంగా చనిపోయిన 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. డీఎన్‌ఏ పరీక్షల్లో వారిలో ఐదుగురు అవని కారణంగానే
చనిపోయినట్లు తేలింది. 2016లో 8మంది కూడా ఈ పులి కారణంగానే చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటి నుండి పులిని పట్టుకొనేందుకు అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ సెప్టెంబరులో ఆ పులిపై ‘షూట్‌ ఎట్‌ సైట్‌’ ఆదేశాలు కూడా ఇచ్చింది. జంతు హక్కుల కార్యకర్తలు ఆ పులిని చంపొద్దని, సజీవంగా పట్టుకోవాలని చేసిన అప్పీళ్లను కోర్టు నిరాకరించింది. దాన్ని చంపొద్దని కోరుతూ ఆన్‌లైన్‌ పిటిషన్‌పై 9వేల మందికి పైగా సంతకాలు చేశారు. మరోవైపు సవిూప ప్రాంతాల్లోని ప్రజలు తమకు పులి వల్ల ముప్పు ఉందని దాన్ని చంపేయాలని కోరారు. ఐదేళ్ల వయసు ఉన్న అవనికి పది నెలల వయసున్న రెండు పిల్లలు ఉన్నాయి. గత మూడు నెలలుగా ఆ పులి కోసం అధికారులు ఎంతగానో గాలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ 150 మంది సిబ్బంది గాలింపు చేపట్టారు. షూటర్స్‌, నిపుణులైన ట్రాకర్స్‌ ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్లు, శిక్షణ పొందిన శునకాల సహాయంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చేపట్టగా ఎట్టకేలకు దొరికింది. మహారాష్ట్రలోని యవత్మాల్‌ ప్రాంతంలో  రాత్రి పులిని చంపేశారు. సంజీవంగా పట్టుకోవాలని అటవీ అధికారులు ప్రయత్నించినప్పటికీ వీలు కాకపోవడంతో పులిని హతమార్చారు. అవని దాదాపు 13 మందిని పొట్టనపెట్టుకున్నట్లు అధికారులు విశ్వసిస్తున్నారు. పులిని హతమార్చడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్నారు.