అవార్డు పొందిన ఉపాధ్యాయులపై పెరిగిన బాధ్యత

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమ విద్యను ప్రోత్సహించాలి

ఉపాధ్యా అవార్డుల ప్రదానోత్సవంలో కడియం శ్రీహరి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, మెరుగైన, నాణ్యమైన విద్యను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తూనే ఉచిత విద్యకు బలమైన పునాది వేశామని అన్నారు. అనేక గురుకులాలను ప్రారంభించామని అన్నారు. రవీంద్రభారతిలో గురు పూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులూ కల్పిస్తున్నామని, ఖాళీలు భర్తీ చేస్తున్నామని కడియం చెప్పారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్‌, మండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను చిత్రపటానికి కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులందరికీ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉత్తమ ఉపాధ్యాయులు పని చేయాలన్నారు. విద్యార్థులను పాఠశాలకు రప్పించడంలో కృషికి గానూ నర్వ హెడ్‌మాస్టర్‌కు స్పెషల్‌ అవార్డు వచ్చిందని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. సర్కారు పాఠశాలలు, కళాశాలల్లోని సమస్యలను తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యారంగంలో అందరూ రాష్ట్రం వైపు చూసేలా వ్యవస్థను మారుస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. రెండేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరిగిందన్నారు. ఒక ఉపాధ్యాయుడే విద్యాశాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి తలసాని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో విద్యారంగంలో అనేక మార్పులు జరుగుతున్నాయన్నారు. ఇదిలావుంటే డిజిటల్‌ అక్షరాస్యతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒకరు డిజిటల్‌ అక్షరాస్యత కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తున్న చిత్రాలను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. తెలంగాణలో డిజిటల్‌ అక్షరాస్యతకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.