అవినీతికి తావులేని పాలన అందిద్దాం

– రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది
– మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి
– అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి
– 25మందితో పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేస్తా
– ఐదుగురు డిప్యూటీ సీఎంలు నియమిస్తాం
– వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం
– రెండున్నరేళ్ల తరువాత 90శాతం మంది మంత్రులను మారుస్తాం
– యువకులు, సీనియర్లకు అవకాశాలు కల్పిస్తాం
– సంచలన ప్రకటన చేసిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : అవినీతికి తావులేని పాలన అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని, ఆమేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులంతా సహకరించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. సంచలన నిర్ణయాలు వెల్లడించారు.. మంత్రివర్గ కూర్పుపై మాట్లాడుతూ.. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని, వీరిలో అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించినట్లు జగన్‌ తెలిపారు. డిప్యూటీ సీఎం పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించన్నట్లు జగన్‌ ప్రకటించారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయమని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి ¬దా కల్పించడం జరుగుతుందని జగన్‌ తెలిపారు. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సమావేశంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షధ్వానాలు చేశారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశర చేశారు. మొత్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్‌లో సగం
మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, 90శాతం మంత్రి మంత్రులను మార్పుచేస్తామని, వీరి స్థానంలో కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోందని, మనం వేసే ప్రతిఅడుగు ప్రజలకు దగ్గర చేయాలన్నారు. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని జగన్‌ తెలిపారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగానని జగన్‌ తెలిపారు. ఇక నుంచి ప్రతి టెండర్ల పక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ప్రతి కాంట్రాక్ట్‌ పక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుందని, ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల పక్రియ ఉంటుందని, జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయని జగన్‌ తెలిపారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ పక్రియ చేడతామని, రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామని జగన్‌ తెలిపారు. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారనిఆరోపించిన జగన్‌, ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నామని, అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్‌ తెలిపారు. మనం వేసే ప్రతిఅడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలని, నామినేషన్‌ పద్థతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు కేటాయిస్తామని జగన్‌ తెలిపారు.
ఆ ఐదుగురెవరు?
మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురుకి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. ఆ ఐదుగురు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు జగన్‌ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్‌ స్పష్టం చేశారు. కాగా డిప్యూటీ సీఎంల రేసులో కాపు సామాజిక వర్గంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన కాకుంటే ఆళ్ల నానికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీ వర్గం నుంచి అంజాద్‌ బాషా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సుచరిత, బీసీ సామాజిక వర్గం నుంచి పార్థసారధి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి రాజన్న దొరలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశాలు ఉన్నాయి.