అవినీతిపై ప్రజలు తిరగబడాలి

26తరువాత అవినీతి వ్యతిరేక యాత్రం : విహెచ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 24 : ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించిన రీతిలోనే అవినీతిపై కూడా స్పందించాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని అన్నారు. ఢిల్లీ ఘటనపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. రాజకీయ నేతలు కూడా స్పందించాలన్నారు. ఢిల్లీలో ఈ తరహా విద్యార్థుల ఆందోళన, ఆగ్రహం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. మహిళలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యదేశంలో మహిళలను ఎక్కడైనా.. ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరగొచ్చన్నారు. అవినీతిపై ప్రజలు తిరగబడాలన్నారు. ప్రజలు తిరగబడితేనే రాజకీయాలలో మార్పులొస్తాయన్నారు. అధిష్టానం అనుమతితో 26 తరువాత అవినీతికి వ్యతిరేకంగా యాత్ర చేపడతానన్నారు. ఢిల్లీ ఘటనపై స్పందించిన రీతిలోనే ప్రజలు అవినీతిపై తిరగబడాలని అన్నారు.