అవినీతిరహిత ప్రభుత్వం

సొంతిల్లు లేని వారికి జాగాతో పాటు నగదు

50శాతం మేర విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌

భోపాల్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారందరికీ రూ.2.5 లక్షలతో పాటు 450 చదరపు అడుగుల భూమిని ఇస్తామని తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల రుణాలను మాఫీ చేసి, వారికి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. అలాగే, రైతులకు విద్యుత్తు ఛార్జీలను 50 శాతం తగ్గిస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం రోజు విడుదల చేశారు. రైతులు, పేదలపై వరాల జల్లు కురిపించారు. ఈ మ్యానిఫెస్టోను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాధిత్య సింధియా కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్‌ మాట్లాడుతూ… తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మారుమూల ప్రాంతాల నుంచి భోపాల్‌ వరకు కొంచం కూడా అవినీతి కూడా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులను రాబడతామని కమల్‌నాథ్‌ తెలిపారు. తమ రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక సురక్ష పెన్షన్‌ లబ్దిదారులకు అందిస్తున్న రూ.300ను రూ.1000కి పెంచుతామని చెప్పారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వాన్ని గ్దదెదింపి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాధిత్య సింధియా ఉద్ఘాటించారు. కాగా, ఆ రాష్ట్రంలో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్టాల్ర అసెంబ్లీ ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి