అవినీతిలో భారత్‌ నెంబర్‌ వన్‌ !

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అవినీతిలో భారత్‌ కు అగ్రస్థానం దక్కింది. ఆసియా దేశాల్లో దేశంలోనే ఎక్కువ శాతం అవినీతి జరుగుతున్నదని సర్వే నివేదికలో వెల్లడయింది. . ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తన సర్వే నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. అవినీతిని రూపుమాపాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న లక్ష్యాలను అందుకోవాలంటే ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉందని ఆ నివేదిక తెలిపిందిది. ఆసియాలో ఉన్న అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల జాబితాను శుక్రవారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపింది. భారత్‌ తర్వాత వియత్నాం, థాయిల్యాండ్‌, పాకిస్థాన్‌, మయన్మార్‌ దేశాలు ఉన్నాయి. భారత్‌లో అవినీతి 69 శాతం ఉన్నదని సర్వే తెలిపింది. ఆ తర్వాత వియత్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే పనులు జరుగుతాయట. పాకిస్థాన్‌లో అవినీతి 40 శాతం ఉన్నదట. భారత్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవల రంగాల్లో లంచం మరీ ఎక్కువగా ఉన్నట్లు ఆ రిపోర్ట్‌ స్పష్టంచేసింది. అయితే అవినీతిని అంతం చేసేందుకు పోరాటం చేస్తున్న ప్రధాని మోడీపై ఆ నివేదిక ప్రశంసలతో ముంచెత్తింది.