అవినీతి, అక్రమాలతో అభివృద్ధి
సంక్షేమం శూన్యంకాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై టిడిపి ఫోటో ప్రదర్శన
విజయనగరం, జూలై 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఫలితంగా అభివృద్ధి, సంక్షేమం పూర్తిస్థాయిలో కుంటుపడిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. గురువారం ఇక్కడి కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అవినీతి ఎంత ప్రమాదకరమైనదో ప్రజలకు వివరించేందుకే కాంగ్రెస్ చేసిన అవినీతి అక్రమాలపై వెలువడిన కథనాలను ఎగ్జిమిషన్‌లో ప్రదర్శించామన్నారు. జలయజ్ఞం కింద జిల్లాలో చేపట్టిన నాలుగు సాగునీటి ప్రాజెక్టులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు. ఫలితంగా ప్రజలకు రోగాలు వస్తున్నాయన్నారు. మంచినీటి సరఫరా సైతం అస్తవ్యస్థంగా మారిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సైతం సక్రమంగా పని చేయడం లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు కల్లు తెరుచుకోకపోతే ఈ ప్రభావం భవిష్యత్‌లో ప్రజలపై పడుతుందన్నారు. బాధ్యత గల ప్రతి పక్షంగా ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. విద్యుత్ సరఫరా సైతం అస్తవ్యస్థంగా మారిందన్నారు. 14 అంశాలపై ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని ప్రజలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించి తగిన సలహాలు, సూచనలను ఇవ్వాలన్నారు. ఈ ప్రదర్శనను పలు పార్టీల నేతలు, పట్టణ ప్రజలు తిలకించారు. విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్‌లో జిల్లా పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ద్వారాపురెడ్డి జగదీష్, ఐవిపి రాజు, పార్టీ నేతలు ప్రసాదుల రామకృష్ణ, డాక్టర్ డివిజి శంకరరావు, కనకల మురళీ మోహన్, రొంగలి రామారావు, ప్రసాదుల కనకమహాలక్ష్మి, లోక్‌సత్తా జిల్లా పార్టీ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.