అసద్‌కు ఐఎస్‌ వార్నింగ్‌

3
హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఐఎస్‌ఐఎస్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు వచ్చింది. త్వరలోనే భారతదేశంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే.. ఏదో ఒకరోజు అందరూ చనిపోవాల్సిందేనని, కొందరు ఒకరోజు ముందు, మరికొందరు ఒకరోజు తర్వాత పోతారని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. గతంలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. యువకులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని ఇటీవల పలు బహిరంగ సభలలోనూ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు. దీంతో ఐఎస్‌ఐఎస్‌ ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్‌ తాజా బెదిరింపులపై అసదుద్దీన్‌ స్పందించారు. ఐఎస్‌ఐఎస్‌ ఇస్లాం మతానికి వ్యతిరేకమని, ఆ ఉగ్రవాద గ్రూపు ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. ”ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే. కొందరు ముందు పోతే, మరికొందరు వెనక పోతారు. నేను మాత్రం ఐఎస్‌ఐఎస్‌ అంటే భయపడేది లేదు. ఐఎస్‌ఐఎస్‌ వల్ల లక్షన్నర మంది ముస్లింలు చనిపోయారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే అది పుట్టింది. ప్రపంచంలో ఉన్న స్కాలర్లందరూ దాన్ని ఖండించారు, నేనూ ఖండించాను. ఇస్లాంకు, ఐఎస్‌ఐఎస్‌కు సంబంధం లేదు. సోషల్‌ విూడియాలో మాత్రమే అలా ప్రచారం జరుగుతోంది. ఐఎస్‌ఐఎస్‌ ఒక ఉగ్రవాద సంస్థ. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా” అని అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.