అసెంబ్లీ ఎదుట విపక్ష సభ్యుల ధర్నా

5
నేటినుంచి కాంగ్రెస్‌ భరోసాయాత్రలు

తెలంగాణలో  ప్రభుత్వ తీరును నిరసిస్తూ, విపక్షాలను అసెంబ్లీలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనబాట పట్టింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో మంగళవారం నుంచి రైతు భరోసాయాత్రను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం విూడియాతో మాట్లాడుతూ… 6న మహబూబ్‌ నగర్‌, 7న మెదక్‌, 8న ఖమ్మం, 9న వరంగల్‌, 11న నిజామాబాద్‌ జిల్లాలో రైతు భరోసాయాత్రలు చేపడుతామని ఉత్తమ్‌ వివరించారు.  గ్రామాల్లో తిరిగి రైతులకు భరోసా కల్పిస్తామని అన్నారు. రుణమాఫీ జరిగేలా పోరాడుతామన్నారు. అప్పులబాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, రైతులలో ధైర్యాన్ని నింపేందుకు తమ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని టీపీసీసీ చీఫ్‌ వివరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే 10న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆరోజు యాత్ర లేదని చెప్పారు. ఈ బంద్‌ పిలుపునకు విపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి.  రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణపై ఈ నెల పదిన బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్‌,టిడిపి, బిజెపి, వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌,సిపిఐ,సిపిఎం పక్షాలన్ని ఈ బంద్‌ కు మద్దతు ఇచ్చాయి. అసెంబ్లీ నుంచి విపక్షాలను సస్పెండ్‌ చేశాక విపక్షాలు సమావేశమై కార్యాచరణ చేపట్టాయి. అనంతరం గాంధీవిగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. దీనికి నిరసనగా  ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కూడా నిర్ణయించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ఆందోళన చేపడతారు.టిడిపి నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ శాసనసభలో విఫక్షాలను సస్పెండ్‌ చేసి ఏమి చర్చిస్తారని ప్రశ్నించారు. జెండాలను పక్కనబెట్టి తాము ఐక్య పోరాటం చేస్తామని ఆయన అన్నారు.  తెలంగాణ శాసనసభలో సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేపట్టాయి. పలపకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలని కోరితే ప్రభుత్వం విపక్ష సభ్యులపై దౌర్జన్యానికి దిగుతోందని సభ్యులు ఆరోపించారు.