అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక
తొలి ఓటు వేసిన మంత్రి కెటిఆర్
తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహణ
హైదరాబాద్,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేసారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్మా, బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల 21న ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, ఈఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708. పోలింగ్‌కు 15నిమిషాల ముందే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. మొదటి ఓటు బీజేపీ ఎమ్మెల్యేలదే ఉండేలా ఎమ్మెల్యేలు రాజసింగ్, ఈటల రాజేందర్ , రఘనందనరావు ప్లాన్ చేశారు.ఈ క్రమంలోనే ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అయితే మంత్రి కేటీఆర్ మొదట ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో.. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.. రాష్ట్ర శాసనసభలో ఓటు వేశారు.