అసోం సమస్యకు కాంగ్రెస్ కారణం
సరిహద్దు రాష్ట్రం కావడంతో పాటు, గత కాంగ్రెస్ పాలకుల ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా అసోంలో వలసలు పెరిగి స్థానికులను సవాల్ చేసేదిగా పరిస్థితులు వచ్చాయి. దీంతో స్థానికంగా ఉన్న వారికి ఉపాధి ఉద్యోగావకాశలు దెబ్బతిన్నాయి. అసోంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ విలువనివ్వడంతో పాటు స్థానికుల సమస్యలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అర్థ దశాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తూ వచ్చింది. స్థానికుల సమస్యలను పెడచెవిన పెడుతూ వచ్చింది. అలాగే ఆసు ప్రభుత్వం ఏర్పడ్డా ఆనాటి ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఉద్యమాన్ని తీవ్రంగా నడిపి అధికారంలోకి వచ్చినా అంతర్గత విభేదాలతో అడ్రస్ లేకుండా పోయారు. ఈ దశలో ఇప్పుడు బిజెపి అధికరాంలోకి వచ్చాక మళ్లీ తేనెతుట్టు కదపాల్సి వచ్చింది. ఎక్కడో దగ్గర దీనికి చరమగీతం పాడే ప్రయత్నంలో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. తాజా జాబితా తరవాత వస్తోన్న ఆందోళనల నేపథ్యంలో దీనికి ఎలా ముగింపు ఇస్తారని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. అసోంలో ఏం జరగబోతున్నదన్న విషయం కూడా ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రజలు కూడా తమను ఏం చేయబోతున్నారని ఆశగా చూస్తున్నారు. దీనిపై కేంద్రం ఏదైనా స్పస్టమైన వైఖరి తీసుకోవాల్సిన ఆగత్యం ఉంది. దీనిని చర్చించే ముందు గతాన్ని కూడా నెమరు వేసుకోవాలి. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు,దిగ్బంధనాలు,సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది.వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే రాష్ట్రంలో హిందువు ల కన్నా ముస్లింల జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన పెరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సావిూలు ఉద్యమిస్తూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణ కాండలు జరిగాయి. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, వలసవాదులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సావిూలు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. వరుస ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళన కారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయు లకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సావిూ భాష మాట్లాడే అస్సావిూలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా
స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించేందుకు 1951 తర్వాత తొలిసారిగా అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను ప్రభుత్వం అప్డేట్ చేసింది. ఈ జాబితాలో 40 లక్షల మందికి చోటుదక్కకపోవడంతో వీరిని స్ధానికేతరులుగా పరిగణిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ముసాయిదా జాబితానేనని, దీని ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయడం లేదా వేరే ప్రాంతానికి తరలించడం వంటి చర్యలు చేపట్టబోమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బంగ్లా వలసదారుల పేరుతో అస్సాం ముస్లిం జనాభాను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1983లో జరిగిన ‘నిల్లీ మారణకాండ’, 2012లో జరిగిన ‘కొక్రాజర్ మారణకాండ’లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను పెంచాయి. తాజాగా గుర్తించిన పౌరజాబితాలో పౌర జాబితాలో పేరు దక్కని ఈ 40 లక్షల మంది ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావచ్చని, వారిలో వేల మందైనా విధ్వంసానికి పాల్పడ వచ్చన్న భయాందోళనల మధ్య అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్షిప్ బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సావిూలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను ఈ విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్న బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెబుతోంది.