అస్సాం అతలాకుతలం
– ముంచెత్తిన వరదలు
– రాజ్‌నాథ్ ఏరియల్ సర్వే
– లీటరు పెట్రోల్ రూ.300
గువాహటి,జులై 30(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. అసోంను వరదలు ముంచెత్తడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇక త్రిపురలో నిత్సావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్రోల్ ఏకంగా 300కు లీటర్ చొప్పున అమ్ముతున్నారు. ఇక భారీ వర్షపాతం, నదులు పొంగిపొర్లుతుండటం, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్‌లోని ఎగువ ఆయకట్టు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అసోం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరదల ఉధృతికి ఇంతవరకూ 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 జిల్లాల్లోని సుమారు 19 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులైన వరద బాధితుల కోసం అధికార యంత్రాంగం 800 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి, ఆహారం, మందుల పంపిణీ చేపట్టాయి. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా రాజ్‌నాథ్ వెంట పరిస్థితిని సవిూక్షించారు. ఖింపూర్, గోలాఘాట్, బాంగైగావ్, జోర్హట్, ధెమజి, బార్‌పేట, గోల్‌పరా, ధుబ్రి, డర్రాంగ్, మోరిగావ్, సోనిట్‌పూర్ జిల్లాలు వరదల ప్రభావం తీవ్రంగా పడినట్టు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్
అథారిటీ తెలిపింది. వరద ప్రభావం పడిన తక్కిన జిల్లాలో శివ్‌సాగర్, కోఖ్రాఝర్, డిబ్రూగర్, గోల్‌పర, టిన్సుకియా, బిశ్వనాథ్, నల్బరి, బక్సా, చిరాంగ్ వంటివి ఉన్నాయి. గౌహతిలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. స్థానికి యంత్రాగంతో కలిసి ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం, ఎన్‌ఆర్‌డీఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది విస్తృతంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గత ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు. కాగా, పొంగిపొర్లుతున్న నదుల్లోని వరద నీరు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని అసోం జలవనరుల శాఖ మంత్రి కేశవ్ మహంతా తెలిపారు. ఇక త్రిపురలో భారీ వర్షాలతో గత రెండు రోజులుగా అగర్తలా అతలాకుతలమవుతోంది. దీంతో ఇదే అదనుగా తీసుకున్న వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి పెట్రోలు, డీజీల్ వరకు అన్నింటిపైనా ఒక్కసారిగా రేటు పెంచేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోప్రాంతంలో అసలు నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. పెట్రో, డీజిల్ రేట్లు అయితే ఆకాశన్నంటాయి. లీటరు పెట్రోలు రూ.300, డీజిల్ రూ.150గా అమ్ముతున్నారు. దీంతో సాధారణ ప్రజానికం పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు ధరలు మండుతుండటంతో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సరి-బేసి పద్ధతిలో పెట్రోలు సరఫరాకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ఎదుట టైర్లకు నిప్పుపెట్టి నిరసన చేపట్టారు. ప్రజలు పడుతున్న అవస్థలను చూసిన సర్కార్ నిత్యావసర వస్తువుల కొరతను తీర్చేందుకు ఏర్పాట్లును సిద్ధం చేసింది. రేటు పెంచి నిత్యావసర వస్తువులు గానీ, పెట్రో, డీజిల్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు ప్రభుత్వం హెచ్చరిచ్చింది.




